
నీట్ లీక్ ఎలా జరిగింది?.. బయటపెట్టిన సీబీఐ
ఎన్‌టీఏకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే నీట్ పేపర్ లీక్‌కు కారణమని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది ఛార్జిషీట్ సంచలన విషయాలను వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో పనిచేసిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణుల నుంచే ప్రశ్నపత్రం బయటకు వెళ్లిందని సీబీఐ పేర్కొంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టులో తుది నివేదికను దాఖలు చేసింది.
ఆ ముగ్గురు ఎవరు?
ఛార్జిషీట్ ప్రకారం కెమిస్ట్రీ ఎక్స్‌పర్ట్ పీవీ కులకర్ణి, ఫిజిక్స్ ఎక్స్‌పర్ట్ మనీషా సంజయ్ హవల్దార్, బోటనీ–జువాలజీ ఎక్స్‌పర్ట్ మనీషా గురునాథ్ మంధారే ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు గుర్తించారు. ప్రశ్నపత్రాల అనువాద సమయంలో వారికి రఫ్ పేపర్లు ఇచ్చేవారని, ఆ కాగితాలపై ప్రశ్నలు, జవాబులను రాసుకుని బయటకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ తెలిపింది.
భద్రతా లోపాలే కారణం..
ఎన్‌టీఏ రహస్య విభాగంలోకి ప్రవేశించే సమయంలో లేదా బయటకు వచ్చే సమయంలో నిపుణులను తనిఖీ చేయలేదని ఛార్జిషీట్ పేర్కొంది. దీంతో వారు ఎలాంటి అనుమానం రాకుండా ప్రశ్నల వివరాలను బయటకు తీసుకెళ్లగలిగారని తెలిపింది. అలాగే ఎన్‌టీఏ కార్యాలయంలో ప్రత్యేక సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఈ చర్యలు గుర్తించలేకపోయారని సీబీఐ వెల్లడించింది.
ప్రశ్నలు ఎలా బయటకు వెళ్లాయి?
కులకర్ణి కొన్ని ప్రశ్నలను చిన్న చీటీలపై రాసుకుని, మరికొన్నింటిని గుర్తుంచుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాత పూర్తిగా రాసినట్లు సీబీఐ తెలిపింది. మనీషా మంధారే తన అనుభవంతో ప్రశ్నలను ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలతో అనుసంధానం చేసి సిద్ధం చేసిందని పేర్కొంది. ఫిజిక్స్ నిపుణురాలు హవల్దార్ కూడా తాను వెళ్లిపోయిన తర్వాత ప్రశ్నలను రాసుకున్నట్లు తెలిపింది.
మధ్యవర్తుల ద్వారా అభ్యర్థులకు..
ఈ ప్రశ్నలు నిపుణుల నుంచి పలువురు మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, కన్సల్టెంట్లకు చేరాయని సీబీఐ వెల్లడించింది. అక్కడి నుంచి రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లోని వ్యక్తుల ద్వారా అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు తెలిపింది. కొంతమంది అభ్యర్థుల నుంచి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
ఫోరెన్సిక్‌తో నిర్ధారణ..
స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలు, నోట్లు, డిజిటల్ పరికరాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షల్లో వాటిపై ఉన్న చేతిరాత నిందితులదేనని నిర్ధారణ అయింది. రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ప్రశ్నలు నిపుణులు సిద్ధం చేసిన నోట్లతో సరిపోలినట్లు సీబీఐ తెలిపింది. ఈ ఆధారాలన్నింటి ఆధారంగా ప్రశ్నపత్రం ఎన్‌టీఏలోని రహస్య విభాగం నుంచి బయటకు వచ్చి, మధ్యవర్తుల ద్వారా అభ్యర్థులకు చేరిన మొత్తం గొలుసును ఛార్జిషీట్‌లో సీబీఐ వివరంగా వెల్లడించింది.

