
'సెలూన్' శర్మా, ఫాల్గుణి భర్తను లేపేయాలనే...
కట్టుకున్న మొగుణ్ణి చంపేయడానికి ఓ భార్య, తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నితే ఏం జరిగిందో చదవండి..
ఓ భార్య భర్తకు మరణశాసనం రాస్తే విధి మాత్రం వేరుగా తలచినట్టుంది. కట్టుకున్న భర్తను చంపేయడానికి ఓ భార్య, తన ప్రియుడితో కలిపి పన్నిన కుట్ర విచ్ఛిన్నమై బతికిబట్టకట్టాడు. వడోదరలో జరిగిన ఈ కిడ్నాప్, హత్యాయత్నం ఉదంతం అచ్చం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.
అసలేం జరిగిందంటే...
గిరీశ్ పటేల్ అనే యువకుడు వదోదరలోని ఛననీలో పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 15న షాప్ మూసేసి ఇంటికి తిరిగివస్తుండగా కొంతమంది అతన్ని కత్తితో బెదిరించి కారులో ఎక్కించుకున్నారు. అనుమానం రాకుండా అనేక ప్రదేశాలు తిప్పి సొజిత్రా ప్రాంతానికి దగ్గరలో ఉన్న కాల్వలో పడేశారు. అతనికి ఇంకా భూమ్మీద నూకలు చెల్లలేదు గనుక గిరీశ్ బతికి బయటపడ్డారు. అసలేం జరిగిందనే దానిపై పోలీసులు తీగ లాగితే అసలు డొంకంతా కదిలింది.
సీన్ 1: పక్కా స్కెచ్
కథలో మెయిన్ విలన్ భార్య ఫాల్గుణి. భర్త గిరీష్ పటేల్‌ను అడ్డు తొలగించుకుని, ప్రియుడు కౌశిక్ శర్మతో కలిసి ఉండాలని ప్లాన్ వేసింది. కేవలం రెండు రోజుల్లోనే ప్రియుడికి 100 సార్లు ఫోన్ కాల్స్ చేసిందంటే ఏ స్థాయిలో కుట్ర పన్నిందో అర్థం చేసుకోవచ్చు. ప్రియుడు శర్మ హెయిర్ కటింగ్ సెలూన్ షాపు నడుపుతూనే, మరోవైపు రూ. 35 వేలకు కిరాయి హంతకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సీన్ 2: కిడ్నాప్ డ్రామా
ఈ నెల 15వ తేదీ రాత్రి.. గిరీష్ తన పాన్ షాపు మూసివేసి ఇంటికి బయలుదేరాడు. దారిలో కాపుకాసిన నిందితులు కత్తులతో బెదిరించి అతన్ని కారులోకి ఎక్కించుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు నగరం మొత్తం తిప్పుతూ చివరకు సొజిత్రా ప్రాంతంలోని నిర్మానుష్య కాలువ దగ్గరకు తీసుకెళ్లారు.
సీన్ 3: మృత్యువు అంచున..
నిందితులు గిరీష్‌ను కాలువలోకి తోసేసి, అతను చనిపోయాడనుకుని అక్కడి నుంచి పరారయ్యారు. కానీ ఇక్కడే ఒక 'సినిమా ట్విస్ట్' ఉంది. కాలువలో కొట్టుకుపోతున్న గిరీష్‌కు ఒక రాయి దొరికింది. దాదాపు 3 గంటల పాటు ఆ రాయిని గట్టిగా పట్టుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోరాడాడు. మరుసటి రోజు ఉదయం ప్రాణాలతో బయటపడి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లాడు.
సీన్ 4: పోలీసుల ఇన్వెస్టిగేషన్
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. భార్య ఫాల్గుణి ప్రవర్తనలో మార్పులు గమనించి ఆమె ఫోన్ రికార్డులు తీయగా 'అసలు రంగు' బయటపడింది. ప్రియుడితో కలిసి ఆమె ఆడిన రక్త చరిత్ర వెలుగులోకి వచ్చింది.
సీన్ 5: జైలు ఊచలు
చివరకు ఫాల్గుణి, ఆమె ప్రియుడు కౌశిక్ శర్మతో సహా ఈ కుట్రలో పాల్గొన్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులందరూ కస్టడీలో ఉన్నారు. గిరీష్ పట్ల ఆమె చూపిన 'క్రూరత్వం', గిరీష్ చూపిన 'ధైర్యం' ఇప్పుడు వదోదరలో హాట్ టాపిక్ అయ్యాయి.
భార్య మరణ శాసనం రాస్తే నదిలోని ఆ శిల గిరీష్ ప్రాణాన్ని కాపాడింది.

