
హోస్కోట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి..
బెంగళూరు సమీపంలోని హోస్కోట్ శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హోస్కోట్–దాబాస్పేట జాతీయ రహదారిపై ఎం. సత్యవర గ్రామం సమీపంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. హోస్కోట్ నుంచి దేవనహళ్లి వైపు వెళ్తున్న ఒక ఎస్‌యూవీ కారు ముందు వెళ్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. అనంతరం ఎస్‌యూవీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి క్యాంటర్ వాహనంతో పాటు మరో కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్‌పై వెళ్తున్న 26 ఏళ్ల గగన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. గగన్ నైట్ షిఫ్ట్ పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీలో ఉన్న నలుగురిని అశ్విన్, అర్హాన్, అయాన్, భరత్‌గా పోలీసులు గుర్తించారు. ఇంకా ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హోస్కోట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటు వాహనాల ఢీ తో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

