
చంటిబిడ్డతో ట్రాఫిక్‌ను చక్కదిద్దిన జయశాంతికి హోంమంత్రి ఆతిథ్యం
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సైతం ట్విట్టర్ వేదికగా మాతృత్వానికి.. కర్తవ్యానికి సెల్యూట్ అంటూ ఆమెను కొనియాడారు.
ఖాకీ డ్రెస్ వేసుకున్నా.. వేసుకోకపోయినా తనలోని రక్షక భటుడు ఎప్పుడూ విధుల్లోనే ఉంటాడని నిరూపించారు మహిళా కానిస్టేబుల్ జయశాంతి. చంకలో చంటిబిడ్డతో ఆమె ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన వీడియో యావత్ రాష్ట్రాన్ని కదిలించగా, ఆ సాహసానికి ముగ్ధురాలైన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆమెకు అరుదైన గౌరవం కల్పించారు. గురువారం ఉదయం జయశాంతిని తన నివాసానికి పిలిపించుకున్న మంత్రి, ఆమెతో కలిసి అల్పాహారం చేస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఒక సామాన్య కానిస్టేబుల్‌కు హోంమంత్రి ఇంటి ఆతిథ్యం లభించడం ఏపీ పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే..
రంగంపేట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న జయశాంతి, శనివారం రాత్రి తన రెండున్నరేళ్ల కుమారుడితో కలిసి కారులో కాకినాడ వెళ్తున్నారు. సామర్లకోట రైల్వే స్టేషన్ రోడ్డులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ రద్దీలో రెండు అంబులెన్సులు, ఒక గర్భిణీ ఉన్న వాహనం చిక్కుకుపోవడం ఆమె గమనించారు. ఆ సమయంలో ఆమె విధుల్లో లేరు, అయినా క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు.
మొదట నిద్రిస్తున్న బిడ్డను కారులోని వారికి అప్పగించి 40 నిమిషాల పాటు ట్రాఫిక్ చక్కదిద్దారు. అయితే బిడ్డ నిద్రలేచి ఏడవడం మొదలుపెట్టడంతో, మాతృత్వానికి - కర్తవ్యానికి మధ్య సమతుల్యత పాటిస్తూ బిడ్డను చంకనెత్తుకుని మరీ రోడ్డుపై నిలబడి వాహనాలను మళ్లించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అంబులెన్సులకు దారి క్లియర్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ప్రశంసల వెల్లువ కురిసింది. పోలీసుల గౌరవాన్ని పెంచావు. నీ నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకం అంటూ ఏపీ హోం మంత్రి నాడు ప్రశంసించారు. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సైతం ట్విట్టర్ వేదికగా మాతృత్వానికి.. కర్తవ్యానికి సెల్యూట్ అంటూ ఆమెను కొనియాడారు.
రెండు రోజుల క్రితమే జయశాంతికి ఫోన్ చేసి అభినందించిన హోంమంత్రి అనిత, ఆమె కోరిక మేరకు గురువారం ఉదయం తన నివాసంలో భేటీ అయ్యారు. జయశాంతి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి, నీ నిబద్ధత పోలీసుల మీద ప్రజలకు నమ్మకాన్ని పెంచింది అని కొనియాడారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తన జీవితంలో మరచిపోలేని క్షణమని పేర్కొన్నారు.

