
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుపై స్తంభించిన హైవే!
విజయవాడ కృష్ణలంక నేషనల్ హైవేపై అరగంట పాటు స్తంభించిన వాహన రాకపోకలు
పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుదలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో రాస్తారోకో నిర్వహించారు. కృష్ణలంక నేషనల్ హైవేపై సుమారు అరగంట పాటు వాహన రాకపోకలు స్తంభించాయి.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సి.హెచ్. బాబురావు నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి. కాశీనాథ్, సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు. పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు హైవేపై బైఠాయించి, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ధరల భారాలకు నిరసనగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి తీవ్రంగా నిరసన తెలిపారు.
లిబరేషన్ నేత హరినాథ్, న్యూ డెమోక్రసీ నేత వెంకటేశ్వర్లు, ఎస్‌యుసీఐ నేత అమర్నాథ్, ఎంసీపీఐయు నేత ఖాదర్ బాషా, ఎంఎల్ నేత వీరబాబు, రెడ్ ఫ్లాగ్ నేత ప్రసాద్ బాబు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.
నేతల వ్యాఖ్యలు
12 సంవత్సరాలు పాలించిన మోడీ ప్రభుత్వం పన్నులు, ధరలు పెంచడంలో రికార్డులు బద్దలు కొట్టింది. పెట్రోలియం ఉత్పత్తులపై గత 12 సంవత్సరాలలో 40 లక్షల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేసిన పాపం కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్రంలోనూ గత 12 ఏళ్లలో వివిధ ప్రభుత్వాలు 2 లక్షల 27 వేల కోట్ల రూపాయల వాట్, ఇతర పన్నుల రూపంలో ప్రజల జేబులు ఖాళీ చేశాయి అని ఆరోపించారు.
పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి చమురు ధరలు పెంచడం దుర్మార్గం. 2014లో ముడి చమురు ధర 105 డాలర్లుండగా, ప్రస్తుతం 90 డాలర్లకు పడిపోయినా వంటగ్యాస్ ధర 400 నుంచి వేయి రూపాయలకు, పెట్రోల్ 60 నుంచి 118 రూపాయలకు, డీజిల్ 50 నుంచి 105 రూపాయలకు పెంచి ప్రజల నడ్డి విరిచారు అని విమర్శించారు.
ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు విధిస్తున్నారని, రాష్ట్రంలో పెట్రోల్‌పై 35 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్నులు వసూలు చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అదనపు పన్నులు తగ్గిస్తామని వాగ్దానం చేసిన కూటమి మోసం చేసిందని, ఒక నయా పైసా కూడా తగ్గించలేదని ఆరోపించారు.
“డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు, పన్నులు పెంచి ప్రజలను పీక్కు తింటున్నాయి. విమాన యాన ఇంధనం, రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థల ఎగుమతి ఉత్పత్తులపై పన్నులు తగ్గించి, సామాన్యుల వాడే పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై మాత్రం భారం మోపుతున్నారు” అని నేతలు ఆరోపించారు.
అమెరికా, ట్రంప్‌కు లొంగి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన మోడీ సర్కార్‌ను తీవ్రంగా ఎండగట్టారు. రష్యా, ఇరాన్ నుంచి చౌక చమురు లభించినా కొనుగోలు చేయకుండా అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఇంకా గ్యాస్‌పై రూ. 600, పెట్రోల్ లీటర్‌కు రూ. 15, డీజిల్‌పై రూ. 27 పెంచాలని ప్రకటిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించారు.
పెట్రోలియం ధరల పెంపు వల్ల నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోందని, సామాన్యుల జీవితాలు అధోగతి పాలవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పాపాలకు రాష్ట్రంలో ఎన్‌డీఏ భాగస్వాములైన టీడీపీ, జనసేన కూడా బాధ్యులని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీ, బీజేపీకి భజన చేస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కూడా మోడీ ప్రభుత్వం పై మాట మాట్లాడక మౌనం వహిస్తోందని విమర్శించారు.
కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్ తన్నుకుపోయి వేలాది కోట్లు ఆర్జిస్తున్నా రాష్ట్రానికి రావలసిన వాటా ఇవ్వడం లేదని, గత-ప్రస్తుత పాలకులు దీనిపై నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రాస్తారోకోలు జయప్రదంగా జరిగాయని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, లేనియెడల దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు.

