ఉత్తరాంధ్రకు వాయుగండం: భారీ వర్షాలు, వరద ముప్పు
x

ఉత్తరాంధ్రకు వాయు'గండం': భారీ వర్షాలు, వరద ముప్పు

విశాఖ–గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండంతో పాటు కర్ణాటక నుంచి కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించింది.

వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం తీవ్ర వాయుగుండంగా మారింది. బుధవారం రాత్రికి ఉత్తర కోస్తా–దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లా పలాసలో 100.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గంపరాయిలో 73, విశాఖపట్నం జిల్లా మధురవాడలో 69.5, నంద్యాల జిల్లా కనాలలో 65.91, విజయనగరం జిల్లా భోగాపురంలో 62.9, అనకాపల్లి జిల్లా పరవాడలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నంద్యాల జిల్లా పాములపాడులో 98.75 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా విజయరామపురంలో 90.5, చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో 88.5, పల్నాడు జిల్లా గండివేములలో 78.81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో 20.4 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో 11.5 నుంచి 20.4 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అత్యంత భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా ఏగోటివలసలోని తోటపల్లి కాలువలో స్నానానికి దిగిన హేమంత్‌కృష్ణ (39) గల్లంతయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, కాలువలు, చెరువులు, నదుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. ఆయన మంగళవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వాయుగుండం తీవ్రత, వర్షాల పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సందేశాలు పంపాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. కుంచనపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఇదిలా ఉండగా, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడిని ఉపగ్రహ ఆధారంగా గుర్తించి రైతులకు ముందస్తు సూచనలు అందించేందుకు కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత కాల్ సెంటర్‌లో ఎల్‌నినో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందించేలా ఈ వ్యవస్థను వినియోగించనున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, కాలువలు, లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
Read More
Next Story