ఏపీలో 49 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక
x

ఏపీలో 49 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక

సెగలు కక్కుతున్న భానుడు


రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల కొలిమిని తలపించేలా ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. సోమవారం నాడు ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, ఎండల తీవ్రత మరింత ముదిరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాతో పాటు మన్యం జిల్లాల వాసులను వడగాల్పుల సెగలు వణికించనున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత తోడవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మొత్తం 49 మండలాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో, విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా హీట్ అలర్ట్ జారీ చేసింది. అసలు ఏయే జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది? ప్రజలు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలేంటి? అనే పూర్తి వివరాలు మీ కోసం.

ఉత్తరాంధ్రను వణికించనున్న తీవ్ర వడగాల్పులు
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నప్పటికీ, సోమవారం నాడు ముఖ్యంగా మూడు జిల్లాల్లోని 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు (Severe Heat Waves) వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధిక ప్రభావం
ఈ హెచ్చరికల ప్రభావం అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాపై కనిపిస్తోంది. జిల్లాలోని ఏకంగా 14 మండలాల్లో తీవ్ర వేడి గాలులు వీచనున్నాయి. బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో నిప్పుల కొలిమిని తలపించేలా వాతావరణం ఉండనుంది. మన్యం ప్రాంతంలోని గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాల్లో వేడి తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు.
విజయనగరం, అల్లూరి జిల్లాల్లో సెగలు
మరోవైపు విజయనగరం జిల్లాలోని 8 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం స్పష్టంగా ఉండనుంది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాల్లో భానుడి ప్రతాపం కొనసాగనుంది. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలంలో కూడా తీవ్ర స్థాయిలో వేడి గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మండలాల్లోని ప్రజలు ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం.
వడగాల్పుల ప్రభావం ఉండే ఇతర ప్రాంతాలు (26 మండలాలు)
మరో 26 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. విజయనగరం (8), పోలవరం (7), తూర్పుగోదావరి (2), కాకినాడ (2), అల్లూరి (2), మన్యం (1), అనకాపల్లి (1), ఏలూరు (1), మార్కాపురం (1), వైఎస్సార్ జిల్లా (1) మండలాల్లో ఈ ప్రభావం కనిపిస్తుంది.
నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్..రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు అక్షరాలా నిప్పుల కొలిమిని తలపించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాదరసం ఏకంగా 44 డిగ్రీల మార్కును దాటేసి పయనిస్తోంది. అత్యధికంగా ప్రకాశం జిల్లా మార్కాపురం (కంభం) ప్రాంతంలో 44.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై భానుడి భగభగలకు అద్దం పట్టింది. అదేవిధంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.1°C, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 43.8°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాయలసీమ వ్యాప్తంగా కర్నూలు, పల్నాడు ప్రాంతాల్లో 43.7°C, నెల్లూరులో 43.5°C చొప్పున ఉష్ణోగ్రతలు నమోదై జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 జిల్లాలకు గాను 16 జిల్లాల్లోని 198 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రస్తుత ఎండల తీవ్రతకు పరాకాష్టగా నిలుస్తోంది.
ఎండదెబ్బ తగలకుండా.. జాగ్రత్తలు
భానుడి భగభగల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి సరైన రక్షణ కవచాలు ధరించడం అత్యంత ఆవశ్యకమని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తలకు టోపీ లేదా గొడుగు వాడాలని, తద్వారా నేరుగా తలపై ఎండ పడకుండా చూసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వేడి గాలి (వడగాల్పులు) నేరుగా చెవుల్లోకి వెళ్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున, చెవులను కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలన్నారు. ఎండ తీవ్రత కళ్లకు హాని చేయకుండా ఉండేందుకు నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించడం మేలని, ఇది కేవలం స్టైల్ కోసం కాకుండా ఆరోగ్య రక్షణలో భాగంగా భావించాలని ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్య జాగ్రత్తలు..ద్రవ పదార్థాలే దివ్యౌషధాలు
ఎండలో తిరగడం అందరికీ ప్రమాదకరమే అయినప్పటికీ, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం (షుగర్), రక్తపోటు (బీపీ) ఉన్నవారికి ఇది ప్రాణసంకటంగా మారే అవకాశం ఉంది. అటువంటి వారు సాధ్యమైనంత వరకు నీడలోనే ఉండాలని, ఎండలో శారీరక శ్రమ చేయకూడదని అధికారులు హెచ్చరించారు. శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా మంచినీరు తాగుతూ ఉండాలి. వీటితో పాటు మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి సహజ సిద్ధమైన ద్రవ పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని చల్లబరుచుకోవాలని, తద్వారా వడదెబ్బ ముప్పు నుండి తప్పించుకోవచ్చని ప్రఖర్ జైన్ సూచించారు.
Read More
Next Story