
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో హడావుడి నిర్ణయాలు తగవు..
పదోన్నతులు, కారుణ్య నియామకాలు కొనసాగించాలి.
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు ప్రక్రియను జాబ్‌క్యాలెండర్ పేరిట హడావుడిగా ముందుకు తీసుకెళ్తున్న ఉన్నతాధికారుల నిర్ణయాలు చట్టబద్ధం కాదని, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల హక్కులు దెబ్బతినకూడదని ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీజేఏసీ) అమరావతి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు 27 నెలల సమయం కల్పించిన నేపథ్యంలో కేవలం జాబ్‌క్యాలెండర్‌ను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగుల సేవా హక్కులు, పదోన్నతులు, కారుణ్య నియామకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
50 సంవత్సరాల తర్వాత రాష్ట్రం మరోసారి రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు ప్రక్రియను ప్రారంభించడం పరిపాలనా పరంగా అత్యంత కీలకమైన అంశమని, భవిష్యత్ తరాలకు సర్వీస్ సమస్యలు తలెత్తకుండా విజయవంతంగా అమలు చేయాలని ఏపీజేఏసీ అమరావతి ఆకాంక్షిస్తోంది. అయితే ఆర్థిక శాఖ జూలై 6న జారీ చేసిన మెమో ఆధారంగా జూలై 13 నుంచి పదోన్నతులు, బదిలీలపై ఆంక్షలు విధించినట్లు వివిధ శాఖలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు లేదా సంబంధిత సేవా నియమావళిలో పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలని ఎటువంటి స్పష్టమైన చట్టబద్ధ నిబంధన లేనప్పటికీ ఇలాంటి ఆంక్షలు అమలవుతుండటం చట్టవిరుద్ధమని సంఘం ఆరోపించింది. ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాని అనేక సేవా అంశాలు కూడా నిలిచిపోవడంతో ఉద్యోగుల చట్టబద్ధమైన పదోన్నతి హక్కులు, సీనియారిటీ, సేవా ప్రయోజనాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
కారుణ్య నియామకం అనేది చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకం. దీన్ని బ్యాన్ ఉందని నిలిపివేయడం బాధాకరమని సంఘం పేర్కొంది. అనేక శాఖల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, కేడర్ స్ట్రెంత్ సమస్యలు ఉన్నాయి. పి.ఓ. అమలు ప్రక్రియలో భాగంగా ఇవి బయటకు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు పరిష్కారం కాకుండానే హడావుడిగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఉద్యోగాల్లోకి వచ్చే యువతకు కూడా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రభుత్వ సేవలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, రేపు జాబ్‌క్యాలెండర్‌లో ప్రచురణైన పోస్టుల ద్వారా సేవలోకి వచ్చే నిరుద్యోగ యువత ఇద్దరూ ప్రభుత్వ కుటుంబంలోని సభ్యులేనని, ఇద్దరికీ అన్యాయం జరగకూడదని ఏపీజేఏసీ అమరావతి స్పష్టం చేసింది. అధికారుల అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రస్తుత ఉద్యోగుల హక్కులు దెబ్బతినకూడదని, అలాగే రేపు చేరబోయే యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడకూడదని తమ ఆకాంక్ష అని తెలిపింది. వేలాది మంది ఉద్యోగులు చట్టవిరుద్ధమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయాలని సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాని రాష్ట్రస్థాయి కేడర్లలో పదోన్నతులు, బదిలీలు కొనసాగించాలని, కారుణ్య నియామకాల ప్రక్రియను నిలిపివేయకుండా వెంటనే పూర్తి చేయాలని కోరింది. చట్టబద్ధమైన తేదీ అయిన ఆగస్టు 31, 2026లోపు అన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ ప్యానెల్స్‌ను సేవా నియమావళి ప్రకారం ఖరారు చేసి పదోన్నతులు కల్పించాలని, అనంతరం రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును చట్టబద్ధంగా, పారదర్శకంగా, సమగ్రంగా కొనసాగించాలని డిమాండ్ చేసింది. శాఖల వారీగా ఉన్న సమస్యలు, అవసరమైన సమయం వంటి అంశాలపై శాఖాధిపతులు, గుర్తింపు పొందిన సంఘాల సూచనలతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించింది. ఏపీజేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర రావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

