ఎండల్లో గూడూరు టాప్
x

ఎండల్లో గూడూరు టాప్

రహదారులన్నీ మధ్యాహ్నం వేళ కర్ఫ్యూను తలపిస్తున్నాయి.


రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇవేమి ఎండలురా బాబూ అని సామాన్యులు బెంబేలెత్తిపోయేలా నిప్పుల కొలిమిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు నిప్పులు చెరుగుతున్న ఎండలు, మరోవైపు ఆకస్మికంగా విరుచుకుపడుతున్న అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ సీజన్‌లోనే అత్యంత గరిష్ఠంగా గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఏప్రిల్ ముగిసేసరికే భానుడు ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే, రాబోయే మే నెలలో మంటలు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అటు వడగాల్పులు, ఇటు పిడుగుల భయంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నిప్పుల కొలిమిలా 216 మండలాలు..
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మొత్తం 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 216 మండలాల్లో ఎండ తీవ్రత జనానికి చుక్కలు చూపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 28 మండలాలు ఎండల గుప్పిట్లో చిక్కుకోగా, వైఎస్సార్ కడపలో 26, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తలా 25 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్కును దాటేసి ఆందోళన కలిగిస్తున్నాయి.
కేవలం గూడూరు మాత్రమే కాదు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2°C, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45°C మేర ఉష్ణోగ్రతలు నమోదై మాడు పగిలేలా ఎండలు దంచికొట్టాయి. రాయలచెరువు, తొర్రగుడిపాడు, కారంచేడు వంటి ప్రాంతాల్లోనూ 43 డిగ్రీలకు పైగా సెగలు కురవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రహదారులన్నీ మధ్యాహ్నం వేళ కర్ఫ్యూను తలపిస్తూ నిర్మానుష్యంగా మారుతుండటం ఎండల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.
9 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ముప్పు
క్యాలెండర్ మారుతూ మే నెలలోకి అడుగుపెట్టిన తొలిరోజే (శుక్రవారం, 01-05-26) ప్రకృతి తన కఠిన రూపాన్ని చూపిస్తోంది. రాష్ట్రంలో వాతావరణం మరింత అగ్నిగోళంలా మారబోతోందని, ఏకంగా 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 49 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మే నెల ఆరంభమే ఇలా ఉంటే, ఇక ముందు ముందు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందోనని జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఎండ సెగలకు ఆ మండలాలు విలవిల
ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాపై భానుడు కన్నెర్ర చేశాడు. బలిజపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాల్లో సెగలు తీవ్రంగా ఉండనున్నాయి. అటు పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా ఎండ దెబ్బకు జనం విలవిలలాడక తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవే కాకుండా పల్నాడులో 11, విజయనగరంలో 10 మండలాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 49 మండలాల్లో వడగాలులు తాండవించనున్నాయి. వేడి గాలుల కారణంగా ఉక్కపోత పెరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఒకవైపు ఎండ.. మరోవైపు పిడుగుల వాన
విచిత్రంగా ఎండలతో పాటు రాష్ట్రంలో అకాల వర్షాల ముప్పు కూడా పొంచి ఉంది. అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కాపురం జిల్లా పొదిలిలో 37 మి.మీ వర్షపాతం నమోదవ్వడం గమనార్హం.
రైతులకు, ప్రజలకు సూచనలు
రానున్న మూడు రోజులు అకాల వర్షాలకు ఆస్కారం ఉన్నందున రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే వారు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.
Read More
Next Story