x
నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాథన సమితి ప్రతినిధుల ప్రదర్శన

‘సీడ్ హబ్’ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితులు

రాయలసీమ సాగునీటి సాధన సమితి అసంతప్తిపై వీడియో కథనం


Click the Play button to hear this message in audio format

శ్రీబాగ్ స్ఫూర్తిని అమలుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుంది. మాటలతో కాలయాపన చేసి రైతాంగాన్ని మోసపుచ్చవద్దని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. రాయలసీమ అభివృద్ధి కోసం ఆరు ప్రధాన డిమాండ్లను ఆ సమితి ప్రతినిధులు ప్రభుత్వం ముందు ఉంచారు.

నంద్యాల సంజీవనగర్ గేట్ సమీపంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతు,
"శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తికి అనుగుణంగా రాయలసీమకు పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ, సాగునీటి రంగాల్లో సమన్యాయం చేయాలి" అని
బొజ్జా దశరధరామిరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

త్యాగం సీమది.. న్యాయం ఎప్పుడు?

రాయలసీమ ప్రజల భాగస్వామ్యం, శ్రీ పొట్టి శ్రీరాములు అమర త్యాగం ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు. అనంతరం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా రాయలసీమకు లభించిన రాజధాని హక్కుతో పాటు, కృష్ణా–పెన్నార్ ప్రాజెక్టు వంటి ప్రాంతీయ ప్రయోజనాలు, హామీలు విస్మరణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఎకరాకు నీరు హామీలకే పరిమితమా?
2014 రాష్ట్ర విభజన అనంతరం తెలుగు గంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ తదితర ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమకు సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ, వాటి పూర్తికి తగిన ప్రాధాన్యం, నిధులు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.

“ప్రతి ఎకరాకు నీరు” అనే హామీలు ప్రచారానికే పరిమితం కాకుండా, అవసరమైన నిధులు విడుదల చేసి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

‘సీడ్ హబ్’ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితులు

నంద్యాలను ‘సీడ్ హబ్’గా అభివృద్ధి చేస్తామని చేస్తున్న ప్రకటనలకు RARSలో నెలకొన్న పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని దశరథరామిరెడ్డి అన్నారు. RARS భూముల్లో వైద్య కళాశాల కోసం సుమారు 50 ఎకరాలు కేటాయించడంతో పాటు, తాత్కాలిక కలెక్టరేట్ కోసం పరిశోధనా భవనాలను వినియోగించడం వల్ల వ్యవసాయ పరిశోధనలకు, రైతు సేవలకు నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. RARS భూములు, పరిశోధనా మౌలిక వసతులను పరిరక్షించి, తాత్కాలిక కలెక్టరేట్‌ను అక్కడి నుంచి తక్షణమే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

12 ఏళ్లుగా ‘హార్టికల్చర్ హబ్’ ప్రకటనలే.. ఇప్పుడు

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా కోల్డ్ చైన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ధరల స్థిరీకరణ వంటి మౌలిక వసతులు ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాలేదని దశరథరామిరెడ్డి అన్నారు.
అరటి, మామిడి, చీని తదితర ఉద్యాన రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపకుండా ఇప్పుడు ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ అంటూ ప్రచారం చేయడం కాకుండా, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని కోరారు.
“ప్రచారం కాదు.. కార్యాచరణ కావాలి. ప్రకటనలు కాదు.. రైతులకు ఫలితాలు కావాలి” అని ఆయన స్పష్టం చేశారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆరు ప్రధాన డిమాండ్లు
1.అక్టోబర్ 1ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలి.
శ్రీబాగ్ స్ఫూర్తికి అనుగుణంగా పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ, సాగునీటి అభివృద్ధిలో సమ ప్రాధాన్యం ఇవ్వాలి.
2.రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మూడేళ్లలో రూ.60,000 కోట్లు కేటాయించాలి.
పెండింగ్ ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలి.
3.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి.
శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తికి అనుగుణంగా న్యాయ, పాలనా వికేంద్రీకరణ చేపట్టాలి.
4.చెరువులు, కుంటలు, కాలువలు, పెన్నా పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, స్థానిక జల వనరుల పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి.
5.రాయలసీమ సమగ్ర అభివృద్ధిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి.
సాగునీరు, పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు, పాలన–అభివృద్ధి వికేంద్రీకరణ, సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్, వ్యవసాయం, ఉద్యానవనం తదితర అంశాలపై చర్చించాలి.
6.రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా అభివృద్ధి చేయాలి.
హార్టికల్చర్ సెక్రటేరియట్, డైరెక్టరేట్, జాతీయ స్థాయి వ్యవసాయ/ఉద్యాన విశ్వవిద్యాలయం, పరిశోధనా సంస్థలు, కోల్డ్ చైన్, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, మార్కెటింగ్ మౌలిక వసతులను రాయలసీమలో ఏర్పాటు చేయాలి.

చారిత్రక త్యాగానికి న్యాయం చేయాలి

చారిత్రక త్యాగాలను స్మరించుకోవడం మాత్రమే కాకుండా, వాటి స్ఫూర్తికి అనుగుణంగా రాయలసీమకు న్యాయం చేయాలని దశరథరామిరెడ్డి కోరారు. పై డిమాండ్లను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసి రాయలసీమ సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రరెడ్డి, యర్రం శంకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల సుధాకర్, క్రిస్టియన్ జేఏసీ నాయకులు జానయ్య, ప్రొఫెసర్ శివరామిరెడ్డి, మాజీ సర్పంచ్ ఈశ్వరరెడ్డి, చెరుకూరి వెంకటేశ్వరనాయుడు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షణ్ముఖరావు, పట్నం రాముడు, జానోజాగో మహబూబ్ భాష, న్యాయవాది అసదుల్లా, రాఘవేంద్ర గౌడ్, రామకృష్ణారెడ్డి, కిషోర్, జాషువా, నాగేశ్వరరావు, ప్రకాష్‌రావు, రాజన్, మోహన్‌బాబు, థామస్, జీవన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story