
ఇంధన కొరత భయం అక్కర్లేదు.
ఎల్పీజీ ఉత్పత్తి భారీగా పెంచిన కేంద్రం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇంధన కొరతకు ఎలాంటి అవకాశం లేదని, సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ఎల్పీజీ ఉత్పత్తిని భారీగా పెంచినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రోజుకు 35 వేల నుంచి 36 వేల టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్న ఎల్పీజీని, ప్రస్తుతం 54 వేల టన్నులకు పెంచామని తెలిపారు.
దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ వద్ద 69 రోజుల పాటు సరిపడే ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ నిల్వలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా 45 రోజుల అవసరాలకు సరిపడే ఎల్పీజీ నిల్వలు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఆర్థిక భారం పెరగొచ్చని పూరి పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇంధన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన “పొదుపు” పిలుపును మంత్రి ప్రస్తావించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావాన్ని తగ్గించాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు ప్రారంభించాలని ప్రధాని సూచించారని చెప్పారు.
ఇంధనాన్ని అవసరమైన మేరకే వినియోగించాలని, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని కేంద్రం కోరుతోంది. ముఖ్యంగా నగరాల్లో మెట్రో రైళ్లు ఉపయోగించడం, కార్‌పూలింగ్ చేయడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం వంటి మార్గాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
అదే విధంగా సరుకు రవాణాకు రైల్వే సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని, అవసరమైతే ఇంటి నుంచే పని చేసే విధానాలను కూడా ప్రోత్సహించాలని సూచనలు ఇచ్చింది.
విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారని పూరి తెలిపారు. బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కూడా ప్రజలకు సూచించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సంక్షోభ ప్రభావాన్ని తగ్గించవచ్చని కేంద్రం పేర్కొంది.

