ప్రభుత్వం రైతులకు బకాయి పడింది రూ. 20 వేల కోట్లు
x
గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

ప్రభుత్వం రైతులకు బకాయి పడింది రూ. 20 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన సాయం ఇవ్వటంలో మీన మేషాలు లెక్కిస్తోంది.


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు సుమారు రూ.20 వేల కోట్ల బకాయిలు పడిందని, వీటిని తక్షణం రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.

అన్నదాత సుఖీభవ పథకం, పంటల బీమా నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీలు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, వడ్డీ రాయితీలు తదితర సంక్షేమ పథకాల కింద ఈ బకాయిలు పేరుకుపోయాయన్నారు.

బీమా బకాయిలు, బ్లాక్‌లిస్ట్ హెచ్చరిక

గత ఆరు సీజన్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.4 వేల కోట్ల పంటల బీమా నష్టపరిహారం తక్షణం చెల్లించాలని ఆయన కోరారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఇన్సూరెన్స్ కంపెనీలకు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల రాష్ట్రాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 సార్లు ప్రకృతి విపత్తులు సంభవించాయని, ఆ ప్రాంతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.1,000 కోట్లు బకాయి ఉందన్నారు.

వడ్డీ రాయితీ, రుణ మాఫీ డిమాండ్

లక్ష రూపాయల లోపు పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసినా, రెండేళ్లలో రూ.500 కోట్లు బకాయి పడిందని ఈశ్వరయ్య తెలిపారు. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాల మాదిరిగా రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేసి రైతు ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

అన్నదాత సుఖీభవ, కౌలు రైతుల సమస్యలు

అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి ఏడాది చెల్లించాల్సిన రూ.10,716 కోట్లు, కౌలు రైతులకు రెండేళ్లుగా చెల్లించాల్సిన రూ.3,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.

పంటల మద్దతు ధరలు

ఏలూరు జిల్లాలో పండిన పొగాకు కిలోకు రూ.450, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో పండిన పొగాకుకు కిలోకు రూ.360 చొప్పున కొనుగోలు చేయాలని, చిత్తూరు, రాయలసీమ జిల్లాల్లో తోతాపూరి మామిడి టన్నుకు రూ.18 వేలు, బంగినపల్లి టన్నుకు రూ.25 వేల మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆత్మహత్యలు, రాయబారం

ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్న 200 మంది రైతు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున రూ.140 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.

రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 30న ముఖ్యమంత్రి కార్యాలయానికి రాయబారం నిర్వహిస్తున్నట్లు గుజ్జుల ఈశ్వరయ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Read More
Next Story