ఆ 493 మంది డాక్టర్లు ఏమయ్యారు?
x

ఆ 493 మంది డాక్టర్లు ఏమయ్యారు?

సర్కారీ జీతం.. ప్రైవేటు ప్రాక్టీసు! తీగలాగితే డొంక కదిలిందిలా...


సర్కారీ జీతం… ప్రైవేటు ప్రాక్టీసు!
ఏమీ భాగ్యం..
ఎంతమందికి దక్కుతుందీ భోగం?
ఏమిటిదీ అనుకుంటున్నారా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న లీలలివి.
తీగలాగితే డొంక కదిలిన చందాన పశ్చిమ గోదావరి జిల్లాలో బయటపడిన ఈ బాగోతం ఇప్పుడు రాష్ట్రమంతటికి పాకినట్టు కనిపిస్తోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 18 మంది ప్రభుత్వ వైద్యులు సర్కారీ జీతం తీసుకుంటా విధులకు కొన్నేళ్లుగా డుమ్మా కొడుతున్నారట. అధికారులు తాజాగా దీన్ని గుర్తించి పై వాళ్లకు తెలియజేయడంతో ఇప్పుడు అన్ని జిల్లాలలో ఈ తరహా సిబ్బంది ఎంతమంది అనే వేట మొదలైంది.
చిత్రమేమంటే ఈ తరహా డాక్టర్లలో కొందరు విదేశాల్లో కూడా ఉన్నారట.

తాజాగా వీరిని ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

కానీ.. ఇది కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకే పరిమితమైన వ్యవహారం కాదని తర్వాత తేలింది.
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో చెప్పాపెట్టకుండా విధులకు దూరంగా ఉంటున్న వైద్యులు, సిబ్బందిపై రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన మొదలైంది.
హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్, AYUSH, NHM తదితర విభాగాలను కలిపి 493 మంది వైద్యులు, సిబ్బంది అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఇందులో ప్రొఫెసర్ల నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది వరకు ఉన్నారు.
అంటే ఇది ఒక ఆస్పత్రి సమస్య కాదు..
ఒక జిల్లా సమస్య కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాపిత సమస్య.
సర్కారీ మొద్దు నిద్రకు పెద్ద నిదర్శనం.
తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ -పరిధిలో 70 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది.
వీరిలో గైనకాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్ వంటి విభాగాలకు చెందిన స్పెషలిస్టులు కూడా ఉన్నారు.
వీరు ఏడాదికి పైగా అనుమతి లేకుండా డ్యూటీలకు దూరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరో 154 మంది వైద్యులపై చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి.
వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఆ తర్వాత వీరిలో కొందరు తిరిగి విధుల్లో చేరారు.
అయితే వారిపై క్రమశిక్షణ చర్యలు, ఇంక్రిమెంట్ కోత వంటి శిక్షలు ఉంటాయట.
ఇప్పటివరకు 78 మంది తిరిగి విధుల్లో చేరినట్లు డీఎస్‌హెచ్ అధికారులు తెలిపారు.
ఇక మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం పరిధిలోని బోధనా ఆస్పత్రుల్లో మే నెలలో 51 మంది వైద్యులను తొలగించారు.
మరో 39 మంది వైద్యులకు తుది అవకాశం ఇచ్చారు.
వీరిలో ఐదుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే-- ఇంతమంది డ్యూటీలకు రాకున్నా ఎవరికీ పట్టింపులేకపోవడం.
493 మంది వైద్యులు, సిబ్బంది డ్యూటీలకు రాకుండా ఉంటే వాళ్ల ఆచూకీని, రిజస్టర్ ను ఎవరు పర్యవేక్షించారు?
ఇది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.
ఒక ప్రభుత్వ వైద్యుడు ఒక రోజు విధులకు రాకపోతే.. హాజరు రికార్డులో అది కనిపించాలి.
వారం రోజులు రాకపోతే.. పై అధికారులు ప్రశ్నించాలి.
నెలలు గడిస్తే.. శాఖాపరమైన చర్యలు మొదలవ్వాలి.
మరి కొందరు ఏడాది పాటు.. మరికొందరు అంతకంటే ఎక్కువ కాలం విధులకు దూరంగా ఉన్నట్లు ఇప్పుడు బయటపడితే..
ఇంతకాలం ఈ గైర్హాజరు ఎలా కొనసాగింది?
అసలు హాజరు పర్యవేక్షణ వ్యవస్థ ఎక్కడ ఉంది?
ఇక్కడ మరో కీలక ప్రశ్న.
విధులకు హాజరు కాకపోతే.. వారి గైర్హాజరు రికార్డుల్లో ఉండాలి.
అయితే సుదీర్ఘకాలం విధులకు రాని ఉద్యోగులపై చర్యలు ఎందుకు ఆలస్యమయ్యాయి?
జీతాల చెల్లింపులను ఎవరు ధ్రువీకరించారు?
హాజరు, సెలవులు, జీతాల బిల్లులు.. వీటన్నింటినీ పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
493 మంది గైర్హాజరు కావడం కంటే.. ఆ గైర్హాజరును ఇంతకాలం వ్యవస్థ గుర్తించకపోవడమే పెద్ద ప్రశ్న కాదా?
ఇక్కడ మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది.
కొందరు ప్రభుత్వ వైద్యులు విధులకు హాజరు కాకుండా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అందుకే అసలు తెలుసుకోవాల్సింది..
విధులకు దూరంగా ఉన్న వారిలో ఎంతమంది ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నారు?
ఎంతమంది విదేశాల్లో ఉన్నారు?
మరెంతమంది వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాలతో గైర్హాజరవుతున్నారా?
ఈ వివరాలు కేసులవారీగా బయటకు రావాల్సి ఉంది.
ఇక్కడ మనం మర్చిపోకూడని మరో కోణం ఉంది.
ప్రభుత్వ వైద్యుడు విధులకు రాకపోవడం అంటే ఒక ఉద్యోగి గైర్హాజరు కావడం మాత్రమే కాదు.
ఆ వైద్యుడి కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఒక రోగి వైద్యం కోల్పోవడం.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టుల కొరత ఉంటే..
గైనకాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్ వంటి సేవల కోసం రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి రావచ్చు.
అంటే ఒక వైద్యుడు విధులకు రాకపోతే.. దాని ప్రభావం నేరుగా రోగిపై పడుతుంది.
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది?
అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నవారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని,
కేసులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
ఇలాంటి చర్యల వల్ల ఏర్పడే ఖాళీలను ‘జీరో వేకెన్సీ పాలసీ’ కింద భర్తీ చేయాలని కూడా ఆదేశించారు.
అంటే ఇప్పుడు రెండు పనులు జరగాలి.
విధులకు రాని వారిపై చర్యలు తీసుకోవాలి,
ఖాళీ అయిన పోస్టుల్లో కొత్త వైద్యుల నియామకాలు.
కానీ అసలు పరీక్ష ఇక్కడే.
ఈ చర్యల తర్వాతనైనా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు మెరుగుపడుతుందా?
మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందా? అన్నదే సమస్య
వైద్యుణ్ణి దేవుడితో పోలుస్తారు.
అందుకే వైద్యుడికి జనం చేతులెత్తి దండం పెడతారు.
అటువంటి వైద్యుడు ఒక్కరోజు రాకపోయినా జనానికి సమస్యే.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 493 మంది విధులకు దూరంగా ఉంటే.. ప్రభుత్వ వైద్య శాఖ ఏం చేస్తున్నట్టు?
ఇప్పటికైనా వైద్య శాఖ కదిలి చర్యలకు దిగడం శుభపరిణామం.
Read More
Next Story