
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది పరుగులు
గోదావరికి వరద పోటు, ఎగువ నుంచి తన్నుకొస్తున్న నీటి ఒరవడి
ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తుండగా, సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరొచ్చు.
ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. రాజమహేంద్రవరం వద్ద ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12.60 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తుండగా, భద్రాచలం నుంచి మరింత వరద వచ్చే అవకాశం ఉండటంతో సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీకి చెందిన 175 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ దిగువన ఉన్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
వరద ప్రభావం ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలపై పడుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, కాజ్‌వేలు కొట్టుకుపోవడంతో స్థానికులు మరపడవల సాయంతో ప్రయాణిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 17 మండలాలు, 32 లంక గ్రామాలకు వరద ముప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ జిల్లాలోని అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు.
మరోవైపు తూర్పుగోదావరి, కోనసీమ, పోలవరం జిల్లాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే ప్రజలను తరలించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ శిబిరాలను కూడా సిద్ధం చేస్తున్నారు.
భద్రాచలం నుంచి వస్తున్న వరద మరింత పెరిగితే ధవళేశ్వరం వద్ద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో, రాబోయే కొన్ని గంటలు గోదావరి పరివాహక ప్రాంతాలకు కీలకంగా మారాయి. అధికార యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
Next Story

