అత్త సొమ్ము అల్లుడు ధారబోశాడన్నట్టుగా ఉంది జీవీఎంసీ తీరు. ప్రజల సొమ్మును పప్పు బెల్లాల్లా పంచుకోవడానికే తాము ఎన్నికైనట్టుగా కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల సేవ కోసం ఎన్నికైన సంగతిని పక్కన పెట్టేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జీవీఎంసీ ప్రత్యేక బడ్జెట్ సమావేశం బుధవారం జరగబోతోంది. ఈ బడ్జెట్ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, అధికారులు హాజరవుతారు. త్వరలోనే జీవీఎంసీ పాలకవర్గం పదవీ కాలం ముగియబోతోంది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో చిల్లర వ్యవహారాలకు తెగబడుతున్నారు. జీవీఎంసీలో అభివృద్ధి పనులకు నిధుల్లేవని చెబుతూ వస్తున్న వారు ప్రజల సొమ్మును నిస్సిగ్గుగా, పబ్లిక్‌గా పంచేసుకుంటున్నారు.
కార్పొరేటర్లు, ఇతరులకు పంపిణీ చేసిన గిఫ్టు కూపన్లు ఇవే..
రూ.అర కోటి గిఫ్టార్పణం..
బుధవారం బడ్జెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున బడ్జెట్ గిఫ్టు కూపన్లను ఒకరోజు ముందుగానే (మంగళవారం) పంపిణీ చేశారు. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లు, మరికొందరు ఎక్స్ అఫీషియో సభ్యులు, ముఖ్య అధికారులు వెరసి దాదాపు 200 మందికి గిఫ్ట్ కూపన్లను సిద్ధం చేశారు. రూ.5 వేల విలువ కలిగిన ఐదేసి కూపన్లను వీరికి అందజేశారు. అంటే దాదాపు రూ.అర కోటి అన్న మాట! నగరంలోని ఓ షాపింగ్ మాల్ నుంచి తీసుకున్న ఈ కూపన్లతో ఏదైనా కొనుక్కునే వెసులుబాటు కల్పించారు. వీటిని కేవలం ముగ్గురు సభ్యులు మినహా మిగిలిన (టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్సార్సీపీ) వారంతా తీసుకున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, సీపీఐ కార్పొరేటర్ స్టాలిన్, సీపీఐ(ఎం) కార్పొరేటర్ బి.గంగారావులు మాత్రమే ఈ గిఫ్టులను తిరస్కరించి తమ గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. వీరిలో ఇప్పటికే మూర్తి యాదవ్ తన గిఫ్టు కూపన్లను వెనక్కి ఇచ్చేయగా, గంగారావు, స్టాలిన్లు బుధవారం ఇవ్వనున్నారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార, ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు మాత్రం గిఫ్టు కూపన్ల విషయంలో మాత్రం ఏకతాటిపై నిల్చున్నారు. ప్రజల సొమ్మును తలొకటి పంచుకున్నారు. ఈ రూ.50 లక్షలతో నగరంలో కొన్నైనా అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్న బాధ్యతను విస్మరించారు.
తన గిఫ్టు కూపన్‌ను జీవీఎంసీ అధికారికి ఇచ్చేస్తున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్.
గిఫ్టు కూపన్లు ఎందుకంటే?
ప్రత్యేక బడ్జెట్ సమావేశాలో కొన్ని పద్దులను, పనులను ప్రతిపాదిస్తారు. అవి కొన్ని రూ.లక్షల్లోనూ, మరికొన్ని రూ.కోట్లలోనూ ఉంటాయి. వీటిలో ఇంకొన్ని అడ్డగోలువి, అంచనాలకు మించినవి కూడా ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై కౌన్సిల్ సభ్యులు అభ్యంతరాలు చెప్పకుండా, పెదవి విప్పకుండా ఉండేందుకు, అన్నిటికీ తలూపడానికి ఈ గిఫ్టుల తాయిలాలు ఇచ్చారు. వీటిని అందుకున్న వారు బడ్జెట్లో ఎన్ని అభ్యంతరకరమైన ప్రతిపాదనలున్నా కళ్లు మూసుకుంటారు. చివరకు బడ్జెట్‌కు జై కొడతారు.