KNR : నాగేశ్వర్ రెడ్డి.. నిజంగానే వందల కోట్లకు అధిపతా?
x

KNR : నాగేశ్వర్ రెడ్డి.. నిజంగానే వందల కోట్లకు అధిపతా?

ఓ సబ్ ఎడిటర్ తన జీవిత కాలంలో ఎంత సంపాయించగలడు? కేఎన్ఆర్ జగన్ పీఏ. ఆయనకో బినామీ అంటుందేమిటీ 'సిట్'


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పీఏ కె.నాగేశ్వర్ రెడ్డి (కేఎన్ఆర్). ఇప్పుడీయన వార్తల్లో వ్యక్తి. సాదాసీదా సబ్ ఎడిటర్ నుంచి వందల కోట్ల రూపాయల ఆసామి అంటోంది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్). ఏపీ లిక్కర్ స్కాంగా పేరుగాంచిన మద్యం కుంభకోణం కేసులో ఈ కేఎన్ఆర్ కూ లింకులు ఉన్నాయని సిట్ ఆరోపించింది. ఆ మేరకు దర్యాప్తు చేస్తోంది. దానిలో భాగంగా ఈయన్ను విచారిస్తోంది రెండు రోజులుగా. ఈయనే పీఏ. ఈయనకో పీఏ ఉన్నారని, ఆ వ్యక్తి బినామీ అని చెబుతోంది.
ఆయన ఒకప్పుడు సాదాసీదా సబ్ ఎడిటర్. కానీ, అధికారం అండ చూసుకుని ఐదేళ్లలోనే వందల కోట్ల రూపాయల ఆసామిగా ఎదిగారన్నది సిట్ ఆరోపణ. వైసీపీ హయాంలో సాగినట్టు చెబుతున్న 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా మారారని ఏపీ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చెబుతోంది.
మద్యం లంచాల ద్వారా కొల్లగొట్టిన సొమ్మును దాచడానికి కేఎన్‌ఆర్ ఏకంగా తన పీఏలను, పార్టీ నేతలను బినామీలుగా వాడుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలినట్టు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పీఏకే పీఏ.. ఆయనే ప్రధాన బినామీ!
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కధనం ప్రకారం..'మద్యం సిండికేట్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు కేఎన్‌ఆర్ పక్కా వ్యూహం రచించారు. తన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొంటే ఇబ్బందులు వస్తాయని భావించి, బినామీల రంగ ప్రవేశం చేయించారు. ఇందులో భాగంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి.. కేఎన్‌ఆర్‌కు ప్రధాన బినామీగా వ్యవహరించినట్లు' సిట్ గుర్తించింది.
2019-2024 మధ్య కాలంలో శివశంకరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరిట కేఎన్‌ఆర్ భారీగా స్థిరాస్తులు కొనడంతో పాటు విరివిగా పెట్టుబడులు పెట్టారు.
ఈ బినామీ ఆస్తుల గుట్టు రాబట్టేందుకు తాడేపల్లిలోని శివశంకరరెడ్డి నివాసంలో సిట్ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం (ఈరోజు) విచారణకు హాజరుకావాలంటూ శివశంకరరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
లక్కీ హ్యుందాయ్ షోరూమ్‌లో సిట్ సోదాలు
కేఎన్‌ఆర్ అక్రమ పెట్టుబడుల పర్వంలో విజయవాడ శివారు రామవరప్పాడులోని ‘లక్కీ హ్యుందాయ్’ షోరూమ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం రూ. 2 నుంచి 3 కోట్ల పెట్టుబడితో ఈ షోరూమ్‌లో ఏకంగా 50 శాతం వాటాను కేఎన్‌ఆర్ దక్కించుకున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది.
సిట్ ఆరా తీస్తున్న కోణాలు:
అంత తక్కువ పెట్టుబడికే సగం వాటా ఎలా దక్కింది?
వైట్‌లో కొద్దిగా చూపి, మిగతా భారీ మొత్తాన్ని బ్లాక్ మనీ రూపంలో చెల్లించారా?
ఏదైనా భూ/వ్యాపార వివాదాల సెటిల్‌మెంట్‌లో భాగంగా బెదిరించి ఈ వాటాను కాజేశారా?
మద్యం లంచాల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకే ఈ షోరూమ్‌ను వాడుకున్నారా?
ఈ అనుమానాలతో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు సిట్ బృందాలు లక్కీ హ్యుందాయ్ షోరూమ్‌లో తనిఖీలు చేపట్టాయి. వాటాల పంపిణీకి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. షోరూమ్ యజమాని ఉస్మాన్ సందీప్‌కు కూడా నోటీసులు ఇచ్చి, శుక్రవారం విచారణకు రమ్మని ఆదేశించారు. ఆయన నోటి నుంచి వచ్చే నిజాలు ఈ కేసులో మరిన్ని మలుపులు తిప్పే అవకాశం ఉంది.
గురువారం వరుసగా రెండో రోజు కూడా సిట్ అధికారులు కేఎన్‌ఆర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు (దాదాపు 10 గంటల పాటు) ఈ విచారణ సాగింది.
కేఎన్‌ఆర్ భార్య శశికళ బ్యాంకు ఖాతాల్లోకి వివిధ తేదీల్లో అసాధారణ రీతిలో భారీగా నగదు జమయినట్లు సిట్ ఆధారాలు బయటపెట్టింది.
ఆస్తుల కొనుగోలు తేదీలు, బ్యాంక్ లావాదేవీలను ముందుంచి ప్రశ్నించగా.. కేఎన్‌ఆర్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు.
ఆ డబ్బంతా తన కుటుంబ సభ్యులు వ్యాపారాల ద్వారా సంపాదించిందేనని ఆయన బుకాయించినట్లు సమాచారం. అయితే, సిట్ అధికారులు గట్టిగా నిలదీయడంతోనే బినామీ పుత్తా శివశంకరరెడ్డి పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల జప్తు దిశగా..
ఇప్పటికే మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎన్‌ఆర్ నివాసంలో సోదాలు చేసిన సిట్.. తిరుపతి జిల్లాలోని ఒల్లూరు, దర్శి తదితర ప్రాంతాల్లో ఆయన కొనుగోలు చేసిన వందల ఎకరాల భూములు, విల్లాలు, ఇతర స్థిరాస్తుల చిట్టాను సిద్ధం చేస్తోంది. పదుల కోట్ల రూపాయల ఆస్తులు కొనడానికి ఒక సాధారణ పీఏకు అంత డబ్బు ఎక్కడిదనే ప్రశ్నకు సమాధానం రాబట్టేందుకు.. సోమవారం (వచ్చే వారం) కేఎన్‌ఆర్‌ను మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ ఆదేశించింది.
Read More
Next Story