x
బిల్ గేట్స్ తో చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబులో ఇంత మార్పా? సీఇవో/ సీఎం?

“హైటెక్ చంద్రబాబు”కు మరో కొత్త ట్యాగ్‌లైన్ జతైంది. అదేమిటంటే..


చంద్రబాబు అంటే హైటెక్... వరల్డ్ బ్యాంక్... ఐఎంఎఫ్...

ఇదే ఆయన రాజకీయ ఇమేజ్. టెక్నాలజీ, పెట్టుబడులు, సంస్కరణలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు.. ఇవే చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి గుర్తుగా కనిపించేవి. అంతేకాదు.. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు పెట్టిన ఓ ప్రత్యేకమైన నిక్‌నేమ్ కూడా ఉంది. “ప్రపంచ బ్యాంకు సీఈవో” అంటూ వామపక్షాలు చంద్రబాబును తరచూ ఎద్దేవా చేసేవి.
అలాంటి చంద్రబాబు ఇప్పుడు తనను తాను మరో కోణంలో ప్రజల ముందు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇదే చర్చకు కారణమైంది.
“సీఈవో సీఎం”గా కంటే.. నీటిని అందించిన నేతగా ప్రజల్లో గుర్తుండాలనుకుంటున్నాను అని చంద్రబాబు చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

క్లింటన్ తో చంద్రబాబు (కర్టసీ వీకీపీడియా)

పోలవరం ఎడమ ప్రధాన కాల్వ, వెలిగొండ ప్రాజెక్టులను తన రాజకీయ జీవితంలో కీలక మైలురాళ్లుగా చంద్రబాబు అభివర్ణించారు. దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయిన రెండు కీలక సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు వాస్తవరూపం దాల్చాయని చెప్పారు.

“ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల జీవితాల్లో సరికొత్త మార్పు చూస్తారు. ఈ ప్రాజెక్టులు వ్యవసాయానికి కొత్త ఊపు తీసుకొస్తాయి. తాగునీటి భద్రతకు చిరస్థాయిలో నిలిచిపోయే ఆస్తులుగా మిగులుతాయి” అని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.
హైటెక్ ఇమేజ్ నుంచి నీటి నేతగా..
చంద్రబాబు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. ఆయన పేరు చెప్పగానే టెక్నాలజీ, ఐటీ, సంస్కరణలు, హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన పోషించిన పాత్ర ఆయనకు “హైటెక్ సీఎం” అనే ఇమేజ్‌ను తీసుకొచ్చింది.
అదే సమయంలో ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో సంబంధాల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు ఆయనపై తీవ్ర విమర్శలు చేసేవి. “ప్రపంచ బ్యాంకు సీఈవో” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవి.
కానీ ఇప్పుడు అదే చంద్రబాబు.. తనను “నీటిని అందించిన నేత”గా ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుకోవడం ఆసక్తికర పరిణామం.
ఎందుకీ కొత్త నేరేటివ్?
రాజకీయంగా చూస్తే ఈ వ్యాఖ్యకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. టెక్నాలజీ, ఐటీ, పెట్టుబడులు వంటి అంశాల కంటే నీరు, సాగునీరు, వ్యవసాయం, తాగునీరు నేరుగా ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలు.
పోలవరం, వెలిగొండ వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తన పాలనకు ఒక శాశ్వత గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు వ్యాఖ్యల్లో కనిపిస్తోంది.
అంటే.. “హైటెక్ సీఎం”గా వచ్చిన గుర్తింపును దాటి.. “నీటి సీఎం”గా ప్రజల మనసుల్లో నిలిచిపోవాలన్న ఆకాంక్షనా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.
రాజకీయ ఇమేజ్‌కు కొత్త నిర్వచనమా?
చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి అనే పదానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే అభివృద్ధిని కేవలం టెక్నాలజీ, పరిశ్రమలు, పెట్టుబడులతో కాకుండా.. నీరు, వ్యవసాయం, తాగునీటి భద్రతతో అనుసంధానించడం ఆయన తాజా వ్యాఖ్యల్లో కనిపిస్తున్న మార్పు.
ఒకప్పుడు తనపై ప్రత్యర్థులు చేసిన “ప్రపంచ బ్యాంకు సీఈవో” విమర్శను పట్టించుకోకుండా ముందుకు సాగిన చంద్రబాబు.. ఇప్పుడు తన రాజకీయ వారసత్వాన్ని ఏ రూపంలో ప్రజలు గుర్తుంచుకోవాలనుకుంటున్నారో స్వయంగా చెబుతున్నారు.
సీఈవో సీఎం కాదు.. నీటిని అందించిన సీఎం.
చంద్రబాబు తాజా ట్వీట్‌లోని అసలు రాజకీయ సందేశం ఇదేనా? లేక రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల పూర్తిని తన పాలనా విజయాలకు ప్రధాన అస్త్రంగా మార్చుకునే వ్యూహంలో భాగమా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా.. “హైటెక్ చంద్రబాబు”కు మరో కొత్త ట్యాగ్‌లైన్ జతైంది. అదే.. “నీటిని అందించిన చంద్రబాబు”.
Read More
Next Story