జగన్ పీఏ కేఎన్‌ఆర్ ఖాతాలోనూ కోట్ల కొద్ది కరెన్సీ
x

'జగన్ పీఏ కేఎన్‌ఆర్ ఖాతాలోనూ కోట్ల కొద్ది కరెన్సీ'

ఆస్తులపై ‘సిట్’ ఆరా! ఆయన భార్య బ్యాంక్ ఖాతాలో రూ.19.85 కోట్లా?


వైసీపీ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, నిత్యం ఆయన వెంటే ఉండే పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్) చుట్టూ సిట్ (SIT) ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కేఎన్‌ఆర్‌కు భారీ ఎత్తున లంచాల సొమ్ము అందినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఆయనను దాదాపు 9.30 గంటల పాటు సుదీర్ఘంగా విచారించగా.. దిమ్మతిరిగే ఆస్తుల చిట్టా బయటపడినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
లిక్కర్ మాఫియాకు, నాటి ప్రభుత్వ పెద్దలకు మధ్య కేఎన్‌ఆర్ కీలక వారధిగా వ్యవహరించారని, ప్రతి వారం లంచాల వసూళ్లు, పంపకాల వ్యవహారాలను ఆయనే పర్యవేక్షించారని నమ్ముతున్న అధికార వర్గాలు.. ఆ వివరాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
ఐదేళ్లలోనే వందల కోట్ల ఆస్తులు.. ఎలా సాధ్యం?
సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన కేఎన్‌ఆర్, 2019కి ముందు సాక్షి పత్రికలో కేవలం రూ. 10-15 వేల వేతనంతో పనిచేశారు. జగన్ సీఎం అయ్యాక అదనపు పీఎస్‌గా చేరి ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 2 లక్షల వరకు జీతం పొందారు. ప్రస్తుతం ఎలాంటి వేతనం లేకుండానే పనిచేస్తున్నారు. అయితే, గత ఐదేళ్లలోనే ఆయన వందల కోట్ల విలువైన స్థిరాస్తులు, వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారనే కోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.

కేఎన్‌ఆర్ ఆస్తుల చిట్టా..

భూములు:
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరులో మద్యం కేసు నిందితులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబానికి చెందిన కేవీఆర్ ఇన్‌ఫ్రా లేఅవుట్‌లో కేఎన్‌ఆర్ భార్య శశికళ పేరిట 10 ఎకరాల భూమి ఉంది. దీని రికార్డు విలువ రూ. 81 లక్షలుగా చూపించినా, అసలు విలువ కోట్లలో ఉంటుందని.. ఇది మద్యం లంచాల వాటా కిందే దక్కిందని సిట్ భావిస్తోంది. ఇవి కాకుండా ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాలు, జగ్గయ్యపేట ప్రాంతంలో 40 ఎకరాల వ్యవసాయ భూమి, భోగాపురం విమానాశ్రయం సమీపంలో భారీగా భూములు ఉన్నట్లు గుర్తించారు.
ప్రధాన నగరాల్లో ఫ్లాట్లు/ఇళ్లు..
హైదరాబాద్‌ బేగంపేటలో ఒకటి, తిరుపతిలో రెండు, బెంగళూరులో రెండు, విజయవాడలో ఒక ఫ్లాటుతో పాటు కడపలో సొంత ఇల్లు నిర్మించినట్లు తేలింది.
వ్యాపారాలు, పెట్టుబడులు..
విజయవాడ రామవరప్పాడులోని ఓ ప్రముఖ కార్ల షోరూమ్‌లో రూ. 2-3 కోట్ల పెట్టుబడితో 50% వాటా పొందినట్లు సిట్ గుర్తించింది. అలాగే భార్య శశికళ, అమెరికాలో ఉండే బావమరిది రఘునాథ్‌రెడ్డి పేరిట హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేసి, అందులో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది.
బ్యాంకు ఖాతాలు, బంగారం..
2019-24 మధ్య కేఎన్‌ఆర్ భార్య శశికళ బ్యాంకు ఖాతాలో రూ. 19.85 కోట్ల నగదు జమయింది. అలాగే ఆమె పేరిట 2 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు, కేఎన్‌ఆర్ బంగారం తాకట్టు పెట్టి రూ. కోటికి పైగా రుణం తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
‘ఆడిటర్ చూసుకుంటారు’.. దాటవేత ధోరణి!
బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు జరిగిన విచారణలో సిట్ అధికారులు ఒక్కో ఆస్తి ఆధారాలను కేఎన్‌ఆర్ ముందు ఉంచినట్లు సమాచారం. అయితే, ఈ ప్రశ్నలకు ఆయన నుంచి సూటిగా సమాధానాలు రాలేదని, తీవ్ర దాటవేత ధోరణి అవలంబించారని అధికార వర్గాలు తెలిపాయి.
"బ్యాంకు ఖాతాల్లోకి అంత సొమ్ము ఎలా వచ్చింది? కార్ల షోరూమ్‌లో తక్కువ పెట్టుబడికే 50% వాటా ఎలా దక్కింది? కంపెనీల్లో పెట్టుబడులకు మూలాలు ఏంటి?" అని ప్రశ్నించగా.. తనకు ఏమీ గుర్తులేదని, అన్నీ తన ఆడిటర్ చూసుకుంటారంటూ కేఎన్‌ఆర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది.
కాల్ డేటా ఆధారాలతో ముమ్మర దర్యాప్తు
లిక్కర్ పాలసీ రూపకల్పన, మద్యాన్ని సిండికేట్ చేయడం, వచ్చిన ముడుపులను ఎన్నికల కోసం ఎలా ఖర్చు చేయాలనే అంశాలపై జరిగిన అన్ని కీలక సమావేశాల్లో కేఎన్‌ఆర్ పాత్ర ఉన్నట్లు సిట్ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. నాటి సీఎం జగన్‌ను కలవాలనుకున్న లిక్కర్ గ్యాంగ్ సభ్యులంతా కేఎన్‌ఆర్ ఫోన్ ద్వారానే సంప్రదింపులు జరిపారని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన కీలక కాల్ డేటాను (Call Data) కూడా సిట్ అధికారులు సేకరించారు.
ఈ కుంభకోణంలో మరిన్ని లంకెలను వీడదీసేందుకు, కేఎన్‌ఆర్ ఇచ్చిన పొంతనలేని సమాధానాలపై మరింత క్లారిటీ తెచ్చుకునేందుకు గురువారం (నేడు) కూడా ఆయనను మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ అధికారులు ఆదేశించారు. ఈ విచారణ అనంతరం మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
Read More
Next Story