
Gade Venkata Reddy
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత!
న్యాయవాది నుంచి రాజకీయ వేత్తగా ఎదిగిన గాదె వెంకటరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి (85) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త వినగానే తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
న్యాయవాది నుంచి రాజకీయాల్లోకి..
ప్రకాశం జిల్లా పావులూరులో గాదె వీరారెడ్డి కి జన్మించిన వెంకటరెడ్డి.. బాపట్లలో బి.ఎ, ఎల్‌ఎల్‌బీ (B.A, LLB) పూర్తి చేశారు. వృత్తిరీత్యా అడ్వకేట్, వ్యాపారవేత్త అయిన ఆయన, ప్రజాసేవపై ఉన్న ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1967 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పరిధిలోని పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, కేవలం 27 ఏళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
బాపట్ల నుంచి వరుస విజయాలు...
ఆ తర్వాత పర్చూరుతో పాటు, 2004 నుండి 2014 వరకు బాపట్ల నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) తరఫున ఎమ్మెల్యేగా సేవలందించారు. మొత్తంగా ఆయన 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. కీలక మంత్రి పదవులుసమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న గాదె వెంకటరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల హయాంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.
1993లో కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2009-2010 మధ్య కాలంలో దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి (YSR), కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వించారు.
రాష్ట్ర విభజన తర్వాత...
2014 రాష్ట్ర విభజన అనంతరం ఆయన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2016లో తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరిన ఆయన, ఆ తర్వాత 2020లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)వైపు మొగ్గు చూపారు. వయోభారంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు వైఎస్సార్ సీపీలో చేరారు.
రాజకీయ ప్రముఖుల సంతాపంగాదె వెంకటరెడ్డి మరణం పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "దీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉంటూ నిరంతరం ప్రజల కోసం శ్రమించిన విలక్షణమైన నాయకుడు గాదె వెంకటరెడ్డి. నా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకున్న ఆత్మీయ అనుబంధం మరిచిపోలేనిది. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటు" అని జగన్ పేర్కొన్నారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరికొందరు సీనియర్ నేతలు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం ప్రకటించారు.
Next Story

