జువ్వలదిన్నె సాక్షిగా మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు: జగన్
x

జువ్వలదిన్నె సాక్షిగా మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు: జగన్

జువ్వలదిన్నె హార్బర్‌ను మార్చి 12, 2024 లోనేప్రారంభించామని, జాతికి అంకితం చేశామని జగన్ అన్నారు.


కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ లోని మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ఉదంతమే ఇందుకు నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్‌ను సందర్శించిన ఆయన, స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు.

మా హయాంలో మారిటైం విప్లవం: జగన్
తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మార్చేలా రూ. 26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి చేపట్టామని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలోని రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ వంటి నాలుగు కొత్త పోర్టుల పనులను వేగవంతం చేయడంతో పాటు మత్స్యకారుల కోసం పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. జువ్వలదిన్నె హార్బర్‌ను మార్చి 12, 2024 లోనే ప్రారంభించామని, జాతికి అంకితం చేశామని, మళ్లీ తాము అధికారంలోకి వచ్చి ఉంటే 1,250 మెకనైజ్డ్‌ బోట్లను మత్స్యకారులకు అందజేసేవాళ్లమని పేర్కొన్నారు.
చంద్రబాబు సర్కార్‌కు జగన్ సూటి ప్రశ్నలు
జువ్వలదిన్నె ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు దాటుతున్నా, ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసి ఏడాదిన్నర గడిచినా.. ఇప్పటికీ మత్స్యకారులకు ఎందుకు అప్పగించడం లేదని ఈ సందర్భంగా జగన్ నిలదీశారు. ఏటా 41 వేల టన్నుల మత్స్య సంపదకు నిలయమైన ఈ హార్బర్‌ను మత్స్యకారుల నుంచి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు మేలు చేయకపోగా, వారి పొట్ట కొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
బోట్ల దొంగతనం.. లోకేశ్‌పై విమర్శలు
జువ్వలదిన్నె హార్బర్‌లో సీజ్ చేసిన తమిళనాడు బోట్ల అదృశ్యంపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 12న మంత్రి నారా లోకేశ్ ఇక్కడికి వచ్చారు, సరిగ్గా నాలుగు రోజులకే (మార్చి 16న) సీజ్ చేసిన బోట్లు మాయమయ్యాయి. అధికార పార్టీ పెద్దలే దొంగతనం చేశారు కాబట్టి ఇప్పటివరకు ఒక్క అరెస్టు కూడా లేదు అని జగన్ విమర్శించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మత్స్యకారుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ బోట్ల దొంగతనానికి సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ హామీ.. హార్బర్లు మత్స్యకారుల హక్కు
చివరగా మత్స్యకారులకు ధైర్యం చెబుతూ జగన్ కీలక ప్రకటన చేశారు. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయి, మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ఇక్కడి నుంచి ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని తరిమేస్తాం. రాష్ట్రంలోని పది ఫిషింగ్‌ హార్బర్లు మత్స్యకారుల సొంతం కావాల్సిందే. ఇది మీ హక్కు.. దీనిని చంద్రబాబు తాత కూడా మీ దగ్గర నుంచి లాక్కోలేడు అని జగన్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వంచిన వెంటనే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా డెవలప్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Read More
Next Story