అమరావతిలో పర్యావరణ విధ్వంసం: బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
x

అమరావతిలో పర్యావరణ విధ్వంసం: బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో యువత వాచ్‌డాగ్ గా మారాలన్నారు.


అభివృద్ధి కావాలి.. కానీ అది ప్రకృతిని ఖూనీ చేస్తూ కాదు.. అంటూ రాజధాని అమరావతి నిర్మాణ క్రమంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ గళమెత్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, పర్యావరణ హితమే పరమావధిగా ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాల్‌గా మారాయి. రాజధాని అభివృద్ధి ముసుగులో ప్రకృతిని బలిపీఠం ఎక్కిస్తున్నారంటూ ఆయన ఎండగట్టిన తీరు చర్చనీయాంశమైంది. రాజకీయాలకు అతీతంగా, భావి తరాల మనుగడ కోసం పర్యావరణ ప్రయోజనాలే లక్ష్యంగా తన రాజీలేని పోరాటం కొనసాగుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు.

84 శాతం సాగు భూములే.. ఈ విధ్వంసం ఎవరి కోసం?
అమరావతి అంటే కేవలం కాంక్రీట్ జంగిల్ కాదు.. అది ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన పచ్చని క్షేత్రం అని బొలిశెట్టి సత్యనారాయణ గుర్తుచేశారు. రాజధాని పరిధిలోని భూముల్లో ఏకంగా 84 శాతం అత్యంత సారవంతమైన సాగు భూములు, పర్యావరణానికి ప్రాణవాయువునిచ్చే ప్రదేశాలేనని ఆయన గణాంకాలతో వివరించారు. అభివృద్ధి పేరిట అక్కడి నదులు, వాగులు, కాలువలను కనుమరుగు చేయడం అంటే.. మన చేతులతో మనమే వినాశనాన్ని కొని తెచ్చుకోవడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కట్టండి.. కానీ నిబంధనలకు లోబడి ఉండాలి. ప్రకృతిని పణంగా పెట్టి నిర్మించే ఏ కట్టడమైనా భవిష్యత్తులో శాపంగా మారుతుంది అని ఆయన హెచ్చరించారు.
రాజకీయాల కంటే పర్యావరణమే ముఖ్యం
బొలిశెట్టి తన ప్రసంగంలో రాజకీయ పక్షాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత పాలకులైనా, నేటి కూటమి ప్రభుత్వమైనా పర్యావరణాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. రాజకీయ పార్టీలపై నాకు నమ్మకం పోయింది.. ఇప్పుడు ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత కేవలం మీడియాపైనే ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేవలం అధికారం దక్కించుకోవడం, ప్రాజెక్టులు పూర్తి చేయడం మాత్రమే ప్రభుత్వాల లక్ష్యం కాకూడదని, ప్రకృతిని కాపాడటం అనేది పాలకుల ప్రాథమిక కర్తవ్యమని ఆయన గుర్తుచేశారు. అవినీతిని, పర్యావరణ ఉల్లంఘనలను ఏ స్థాయిలో ఉన్నా నిలదీస్తానని స్పష్టం చేశారు.
యువత ఒక వాచ్‌డాగ్ (Watchdog)గా మారాలి
పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం చట్టాలకో, ప్రభుత్వాలకో పరిమితమైన అంశం కాదని.. అది ప్రతి పౌరుడి బాధ్యత అని బొలిశెట్టి పిలుపునిచ్చారు. పారిశ్రామిక వృద్ధి లేదా భారీ ప్రాజెక్టుల పేరుతో పాలకులు ప్రకృతిని ధ్వంసం చేస్తుంటే.. యువత , పౌర సమాజం ఒక బలమైన నిఘా శక్తిగా (Watchdog) మారి ప్రభుత్వాలను ప్రశ్నించాలని కోరారు. కేంద్ర సాధికార కమిటీ (CEC) వెల్లడించిన నివేదికలు క్షేత్రస్థాయిలోని భయంకరమైన వాస్తవాలకు అద్దం పడుతున్నాయని, ఇప్పుడే మనం మేల్కోకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
Read More
Next Story