విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారట
x

విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారట

సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.


రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెరిగిన జీవన వ్యయంతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తూ, విద్యుత్ కొనుగోలు ఛార్జీలను తగ్గించేలా ప్రణాళికలు రచిస్తోంది. యూనిట్ ధరను రూ.4.60కు తగ్గించడమే లక్ష్యంగా సోమవారం అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అస్తవ్యస్తమైన విద్యుత్ రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించి, ప్రజలపై ఎటువంటి టారిఫ్ పెంపు భారం పడకుండా సమర్థవంతంగా వ్యవస్థను నడిపిస్తున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

ఎనర్జీ యూనివర్శిటీ నుంచి పవర్ స్వాపింగ్ వరకు
ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రపథాన నిలిపేందుకు సీఎం చంద్రబాబు సరికొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధనం) ఉత్పాదనను పెంచడంపై దృష్టి సారించడంతో పాటు, ఈ రంగంలో అత్యాధునిక పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటు ట్రాన్స్‌మిషన్ నష్టాలను తగ్గించడం, ఇటు ఇతర రాష్ట్రాలతో 'పవర్ స్వాపింగ్' ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా కొనుగోళ్ల భారాన్ని తగ్గించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇది విద్యుత్ రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చనుంది.
పీపీఏల రద్దుతో రూ.9,000 కోట్ల నష్టం
గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా పీపీఏల (విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు) రద్దు కారణంగా ప్రజలపై ఏకంగా రూ. 9,000 కోట్ల అదనపు భారం పడిందని ఆయన విమర్శించారు. విద్యుత్ వినియోగించకుండానే కంపెనీలకు భారీ మొత్తంలో చెల్లింపులు చేయాల్సి రావడం గత ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని మండిపడ్డారు. ఈ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్ది, నిరంతర విద్యుత్ సరఫరాను భరోసాగా ఇస్తూనే, సౌర విద్యుత్ (సోలార్ రూఫ్‌టాప్) ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రభుత్వ భవనాలపై సోలార్
పీఎం సూర్య ఘర్, కుసుమ్ వంటి కేంద్ర పథకాల అమలులో ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లోపు ప్రారంభం కావాలని డెడ్ లైన్ విధించారు. అన్ని ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడమే కాకుండా, ఈవీ వాహనాల వినియోగం, విద్యుత్ పొదుపు ఉపకరణాల వాడకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కే. విజయానంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story