ప్రాణం తీసిన కట్నం మీద కట్నం
x

ప్రాణం తీసిన కట్నం మీద కట్నం

విశాఖలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్


వరకట్న వేధింపుల మహమ్మారి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నవారు అడిగినంత కట్నం పోసినా, ఆ కక్కుర్తి మొగుడి ఆశ చావలేదు సరే కదా.. పైగా కనికరం లేని రాక్షసుడిగా మారి ప్రాణం తీశాడు. వివాహమైన కేవలం మూడు నెలలకే డిగ్రీ చదివిన యువతి తేజశ్రీ (22) విశాఖలో విగతజీవిగా మారడం స్థానికంగా పెను సంచలనం రేపింది. పెళ్లిలో ఇచ్చిన 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చాలదన్నట్టు.. బైక్ కావాలని, భూమి రాయాలని నిరంతరం వేధిస్తూ చివరికి ఆమె ప్రాణాలనే బలిగొన్నాడు. అదనపు కట్నం కోసం తన కుమార్తెను చంపేసి, ఇప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆ యువతి తండ్రి చేస్తున్న ఆక్రందన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. సుఖంగా ఉంటుందని కోటి ఆశలతో పంపిన అత్తగారిల్లే ఆ అమ్మాయికి కాటి నివాసంగా మారిన ఈ విషాద ఘటన ఇప్పుడు సమాజంలోని వరకట్న దురాచారాన్ని మరోసారి ఎండగడుతోంది.

మొదటి రోజు నుంచే వేధింపులు..
శ్రీకాకుళం జిల్లా గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ కూతురు తేజశ్రీకి, శ్రీకాకుళం రాగోలు సమీప గూడెంకు చెందిన సోమేష్‌తో ఈ ఏడాది మార్చి 6న ఘనంగా వివాహం జరిగింది. సోమేష్ విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో ప్రాజెక్టు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే, విశాఖలో కాపురం పెట్టిన మొదటి రోజు నుంచే సోమేష్ వేధింపులు మొదలయ్యాయి. ఇటీవల ఓ యువతిని ఇంటికి తీసుకురావడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. దీంతో భర్త వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఇంటికొచ్చిన యువతి విషయంలో తేజశ్రీ నిలదీతపై ఆగ్రహించిన సోమేష్, రూ. 3 లక్షల విలువైన బైక్ కావాలని పేచీ పెట్టాడు. కూతురు కాపురం బాగుండాలని తల్లిదండ్రులు వెంటనే బైక్ కొనిచ్చారు.
ఆశకు అంతులేకుండా..

రూ. 3 లక్షల విలువైన బైక్ ఇచ్చిన వారం రోజులకే సోమేష్ వక్రబుద్ధి మళ్లీ బయటపడింది. ఈ సారి భూమి మీదకు, బంగారం మీదకు మళ్లాడు. పది సెంట్ల భూమి తన పేరున రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని తేజశ్రీని వేధించడం మొదలుపెట్టాడు. చివరికి పెళ్లి ఆల్బమ్ ఖర్చులో సగం (రూ. 1.50 లక్షలు) ఇవ్వాలని డిమాండ్ చేయగా, బాధితురాలి తండ్రి రూ. 50 వేలు పంపారు. ఈ క్రమంలో ఈనెల 7న ఉదయం భార్యాభర్తల మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మీ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయింది అని సోమేష్ తన స్నేహితుడితో తేజశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేయించాడు.

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ?
హుటాహుటిన విశాఖ చేరుకున్న తల్లిదండ్రులకు తమ కుమార్తె బెడ్ మీద విగతజీవిగా కనిపించింది. ఆమెను అలా చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతు పెళ్లై మూడు మాసాలు తిరక్క ముందే కళ్ల ముందు శవంలా కనిపించడాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోయారు. తేజశ్రీ మెడపై, కాళ్లపై వాతలు ఉండటం.. సోమేష్ స్నేహితులు ముగ్గురు స్పాట్లో అక్కడే ఉండటంతో తేజశ్రీ తల్లిదండ్రులకు గుండాగిపోయింది. సోమేష్ తో పాటు అతని ముగ్గురు స్నేహితులపైన అనుమానాలు పెరిగాయి. ఈ నలుగురు కావాలనే ఆమెను చంపేసి ఆత్మహత్యగా మారుస్తున్నారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకుంటే బెడ్ మీద ఎలా ఉంటుంది? ఒంటిపై వాతలు ఎందుకు ఉన్నాయి? అని వారు ప్రశ్నిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విశాఖ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు సోమేష్‌ను అరెస్ట్ చేశారు.
Read More
Next Story