సిగరెట్లపై పన్నులొద్దు.. క్రెడిట్ కార్డు వడ్డీలకు పగ్గాలు వేయండి
x

సిగరెట్లపై పన్నులొద్దు.. క్రెడిట్ కార్డు వడ్డీలకు పగ్గాలు వేయండి

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో పొగాకు రైతులు విజ్ఞప్తి చేశారు.


అటు పొగాకు రైతు కంట కన్నీరు.. ఇటు క్రెడిట్ కార్డు వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతోంది. కేంద్రం పెంచిన భారీ పన్నులు సాగుదారుల ఉసురు తీస్తుంటే, బ్యాంకులు వసూలు చేస్తున్న 55 శాతం వడ్డీలు సామాన్యుడిని కోలుకోకుండా చేస్తున్నాయి. ఈ రెండు కీలక సమస్యలపై ట్రంప్ తరహాలో వడ్డీ రేట్లకు కళ్లెం వేయాలని, సిగరెట్ పన్నులపై పునరాలోచించాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బీజేపీ ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో ఏపీ పొగాకు రైతులు విన్నవించారు. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ సామాన్యుడికి వరంగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జీఎస్టీ పిడుగు.. పొగాకు రైతు బతుకు ఆగమాగం

పొగాకు రైతుపై పన్నుల పిడుగు పడింది. సిగరెట్లపై జీఎస్టీని 28% నుంచి ఏకంగా 40 శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సాగుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఫిబ్రవరిలో జరిగే వేలం పాటలకు కొనుగోలుదారులు వస్తారో రారో అన్న భయం, అప్పుడే కిలోకు రూ. 60-70 పడిపోయిన ధరలు చూసి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే 40-50 మిలియన్ టన్నుల పొగాకు రైతుల ఇళ్లలోనే పేరుకుపోయి ఉండగా, పెరిగిన పన్నులు ఆ నిల్వలను కారుచవకగా మార్చే ప్రమాదం ఉంది. మరోవైపు, ఈ పన్నుల పెంపు వల్ల దేశీయ మార్కెట్ దెబ్బతిని, రూ. 30 వేల కోట్ల నష్టాన్ని మిగిల్చే స్మగ్లింగ్ సిగరెట్లకు రెక్కలు వస్తాయన్నది నిపుణుల హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతు బతుకు చిత్రం ఛిన్నాభిన్నం కాకముందే.. కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని పురందేశ్వరి నేతృత్వంలో ఏపీ పొగాకు రైతులు ఆర్థిక మంత్రికి విన్నపం చేశారు.

క్రెడిట్ కార్డు వడ్డీల దందాకు బ్రేక్ పడేనా

సామాన్యుడి అవసరాలను ఆసరాగా చేసుకుని క్రెడిట్ కార్డు కంపెనీలు చేస్తున్న వడ్డీ వేటపైన కూడా వారు మంత్రికి విన్నవించారు. ప్రస్తుతం బ్యాంకులు 24% నుంచి ఏకంగా 55.55% వరకు వసూలు చేస్తున్న చక్రవడ్డీల వెనుక అసలు పారదర్శకతే లేదని ఆర్థిక మంత్రికి వివరించారు. ఏ రకమైన రుణానికి లేని అసాధారణ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డులపై ఉండటం దోపిడీయేనని దీనికి చెక్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్ములాను భారత్‌లోనూ అమలు చేయాలని మంత్రిని కోరారు. క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను 10 శాతానికి మించకుండా కఠిన నియంత్రణ విధించాలి అని కోరుతూ, రాబోయే బడ్జెట్‌లో దీనిపై చారిత్రాత్మక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.

నవ యువ పారిశ్రామికవేత్తలకు పన్ను ఊరట

దేశంలో అడుగుపెడుతున్న కొత్త ఆలోచనలకు, నవ యువ స్టార్టప్‌లకు ఆర్థిక ఊపిరినిచ్చేలా భారీ పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. భారత్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం కాగితాలకే పరిమితం కాకూడదంటే.. స్టార్టప్‌లకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. ఏటా రూ. 1.2 కోట్ల వార్షిక ఆదాయం వరకు పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తే, యువ పారిశ్రామికవేత్తలు రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతారని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారుతున్న స్టార్టప్ రంగానికి ఈ మినహాయింపు ఒక బూస్టర్ డోస్ లా పనిచేస్తుందని వివరించారు.

Read More
Next Story