సక్సెస్‌ కోసం షార్ట్‌కట్‌లు వెతక్కండి
x
ఏయూ శతాబ్ది వేడుకల వేదిపై ప్రసంగిస్తున్న సచిన్‌ టెండూల్కర్‌

సక్సెస్‌ కోసం షార్ట్‌కట్‌లు వెతక్కండి

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా భారతరత్న, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌ హాజరయ్యారు.


విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతవసంతాల వేడుకకు యాజమాన్యం సచిన్‌ టెండూల్కర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ వేడుకలకు హాజరైన ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ విద్యార్థులు, యువతకు మార్గనిర్దేశం చేశారు. విజయాల కోసం తొందర పడవద్దని, అడ్డదారులు తొక్కవద్దని ఉద్బోధించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నతనంలో తన కుటుంబ పరిస్థితులను కూడా ఈ వేదికపై నుంచి పంచుకున్నారు. ఏకాగ్రత గురించి తన అనుభవాన్ని వివరించారు. సందేశాత్మక ప్రసంగం చేశారు. సచిన్‌‡ తన ప్రసంగంలో ఏమన్నారంటే?


వేదికపైకి వస్తున్న సచిన్‌

రాత్రికి రాత్రే విజయాలు వరించవు..
విద్యార్థినీ, విద్యార్థులు, యువత ఒత్తిడికి లోనవకుండా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలి. ఒడ్డుకు చేరాలంటే నీటిలో ఈదుకుంటూ ముందుకెళ్లాల్సిందే కదా? అదే లక్ష్యంతో ముందుకు సాగాలి. మనసును ఏకాగ్రతతో ఉంచుకోవాలి. పరిస్థితులు, కుంగుబాటు, నిరాశ వంటివి మనలను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. బౌలర్‌ బంతిని వేసేటప్పుడు బ్యాట్స్‌మెన్‌ ఎంతో ఏకాగగ్రతతో ఉంటేనే సరిగా దానిని ఎదుర్కోగలడు. అది యార్కరా; బౌన్సరా అనేది ఏకాగ్రతతో ముందుగా అంచనా వేయాలి. జీవితంలోనూ అంతే. మనం మన చుట్టు పక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ముందుకు సాగాలి. అధ్యాపకుల మార్గదర్శనం లేకుండా ఏ విద్యార్థీ విజయం సాధించలేడు. అంచనాలు పెద్దవైతే బాధ్యతలు కూడా దానికనుగుణంగానే పెరుగుతాయి. విజయం అనేది రాత్రికి రాత్రే విజయం సాధ్యం కాదు. విజయం కోసం ఓపిక. సహనంతో వేచి ఉండాలి. దానికి సమయం పడుతుంది. విజయానికి షార్ట్‌ కట్‌లు వెతక్కండి. యువత లక్ష్యం చేరుకోవడానికి శ్రమ తప్పనిసరిగా అవసరం.

ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో సచిన్‌..

రిటన్‌ గిఫ్ట్‌లు అలా ఇవ్వండి..
యువత, విద్యార్థులు విద్యానంతరం ప్రయోజకులై తల్లిదండ్రులకు, చదువుకున్న విద్యాలయాలకు రిటన్‌ గిఫ్ట్‌లు ఇవ్వండి. ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తోంది. విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యమివ్వండి. ఎందులోనూ రాజీ పడకండి. విద్యలోనూ, క్రీడల్లో ఒత్తిడి సహజం. అంతర్గత, బహిర్గత ఒత్తిళ్లు ఉంటాయి. వీటిని అందరూ ఎదుర్కొంటున్నారు. వాటిని ఓపిగ్గా అధిగమించాలే గాని కుంగిపోకూడదు. మన పరిసరాలను గమనిస్తూనే లక్ష్యం వైపు అడుగులు వేయాలి. ఈ రోజుల్లో సోషల్‌ మీడియా చాలా చురుగ్గా ఉంది. విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు కూడా ఇప్పుడు ప్రాధాన్యమిస్తుండడం మంచి పరిణామం. నన్ను ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

చంద్రబాబు, రామ్మోహన్‌నాయుడు, లోకేష్‌లతో సచిన్‌ మాటామంతి

నాన్న నుంచి చాలా నేర్చుకున్నా..
మా నాన్న∙ప్రొఫెసర్‌.. అయినా మా ఇంట్లో మాకు సరైన సదుపాయాలుండేవి కావు.. మా ఇంట్లో మేం అటాచ్డ్‌ కిచెన్‌ కం బెడ్‌ రూమ్‌లో ఉండేవాళ్లం. మా తండ్రి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సహనం కూడా నేర్చుకున్నాను. నేను చాలా సమయం సంగీతంతో గడిపే వాడిని. నేను క్రికెటర్‌గా ఎదిగినప్పుడు వచ్చిన కారులో మ్యూజిక్‌ వినేవాడిని. కానీ నాన్న సంగీతం విన వద్దనే వారు కాదు.. కాస్త సౌండ్‌ తగ్గించమకి కూడా అనే వారు కాదు. ఆయన సంగీతంకంటే తను చదివే పుస్తకంపైనే ఏకాగ్రత పెట్టేవారు. ఎక్కువగా విద్య, పరిశోధనపైనే ఆలోచన చేసేవారు. అలా ఆయన నుంచి సౌమ్యం, నొప్పించకుండా మాట్లాడడం అలవరచుకున్నాను. అని సచిన్‌ టెండూల్కర్‌ వివరించారు. సచిన్‌ ప్రసంగానికి సభకు హాజరైన విద్యార్థులు ఎంతగానో ముగ్ధులయ్యారు. మధ్యమధ్యలో కరతాళ ధ్వనులు చేశారు. సచిన్‌ పేరుతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
Read More
Next Story