మీ జనగణన మీరే చేసుకోండి..ఏప్రిల్ 30 వరకు గడువు
x

మీ జనగణన మీరే చేసుకోండి..ఏప్రిల్ 30 వరకు గడువు

ఏపీ సీఎస్ కీలక ఆదేశాలు జారీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ లెక్కింపు)కు ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, శాఖాధిపతులకు ఆయన సర్క్యూలర్ జారీ చేశారు.

ఆన్‌లైన్‌లో సులభంగా నమోదు
ప్రజలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా se.census.gov.in పోర్టల్‌ను సందర్శించి వివరాలను నమోదు చేసుకోవచ్చని సీఎస్ వెల్లడించారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 15 రోజుల పాటు ప్రత్యేక అవుట్‌రీచ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
అవగాహనకు రంగంలోకి సెలబ్రిటీలు
జనగణన ప్రాధాన్యతను అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖ వ్యక్తులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు, ఉపాధి హామీ కార్మికులు, ప్రభుత్వ సిబ్బంది కోసం కార్యాలయాల్లోనే ప్రత్యేక డ్రైవ్‌లు ఉంటాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించి, వారి ద్వారా కుటుంబ సభ్యులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారు. అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బందితో పాటు నగరాల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 26న Census 5K రన్
ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా Census 5K Run నిర్వహించనున్నట్లు సీఎస్ ప్రకటించారు. ఇది యువతను, సామాన్య ప్రజలను జనగణన ప్రక్రియ వైపు ఆకర్షించేలా ప్లాన్ చేశారు. అలాగే ప్రతి గ్రామ/వార్డు సెక్రటేరియట్‌లో రోజుకు కనీసం 10 నుంచి 20 మంది స్వీయ లెక్కింపు చేసుకునేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.
బలవంతం లేదు.. అంతా స్వచ్ఛందం
స్వీయ లెక్కింపు అనేది పూర్తిగా స్వచ్ఛందమైనది మాత్రమే. ఎవరినీ బలవంతం చేయవద్దు. కానీ, దీని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలి అని సీఎస్ సాయిప్రసాద్ స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలు, వారంతపు సంతల (శాండీలు) వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని, మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఐఅండ్‌పీఆర్ (I&PR) శాఖను ఆదేశించారు.
Read More
Next Story