ఉద్యోగుల హక్కుల పోరాటాన్ని రాజకీయ అజెండా అంటారా?
x
ఉద్యోగుల ఐక్యత తెలియసేస్తున్న ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘ నేతలు

ఉద్యోగుల హక్కుల పోరాటాన్ని రాజకీయ అజెండా అంటారా?

మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ఖండించారు.


ఉద్యోగుల హక్కుల పోరాటాన్ని రాజకీయ అజెండాగా అభివర్ణించడం సముచితం కాదని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీలనే గుర్తు చేస్తున్నామని, ఉద్యోగుల సమస్యలే తమ ఏకైక అజెండా అని తెలిపారు. ఉద్యమ కార్యాచరణను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా, డివిజన్ స్థాయి నాయకులకు పిలుపునిచ్చారు.

ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, ఉద్యమ పోరాట కమిటీ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, మహిళా విభాగం చైర్‌పర్సన్ పారేలక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడారు.

ఉద్యోగుల హక్కుల కోసం ప్రశ్నించడం, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం ప్రభుత్వాన్ని అవమానించడం కాదని వారు అన్నారు. తమది రాజకీయ అజెండా కాదని, ఉద్యోగుల ప్రయోజనాలే ఏకైక లక్ష్యమని బొప్పరాజు స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమస్యలు పరిష్కరించాలని కోరుతామని, 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలు పరిష్కరించిన సందర్భంలో వాటిని పుస్తక రూపంలో ప్రచురించి అప్పటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపామని గుర్తు చేశారు. 2022-23లో చలో విజయవాడ తర్వాత చర్చల్లో ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఒంటరిగా 92 రోజులు ఉద్యమం చేసి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకున్నామని తెలిపారు.


విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఈ నెల 28న జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన మాటలను వీడియో రూపంలో ఉద్యోగులకు గుర్తు చేశామని, హామీలను అమలు చేయాలని కోరడం కుట్ర కాదని అన్నారు. జూన్ 7 రాష్ట్ర కార్యవర్గ తీర్మానం మేరకు ఉద్యమ సన్నద్ధ సభలు ప్రారంభించబోతుండగా రెవెన్యూ మంత్రి సానుకూలంగా ఉందని వెనక్కి పిలిపించి జూలై 10, 11 తేదీల్లో చర్చలు జరిపారని, జూలై 22న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిందని, ఆగస్టు 2, 16 తేదీల్లో రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశాలు నిర్వహించామని వివరించారు. ఐదుగురు మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులతో సుమారు ఐదు గంటలు చర్చలు జరిపినా ఫలితాలు రాలేదని, 40 రోజులుగా నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నా స్పష్టత రాలేదని ఆగస్టు 28న రాష్ట్ర సదస్సు నిర్వహించామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చెల్లింపులను స్వాగతించి ధన్యవాదాలు తెలిపామని, ఫిబ్రవరి 5న జరిగిన సభలో ప్రభుత్వ పనితీరును అభినందించామని గుర్తు చేశారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందించడం, ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రశ్నించడం కూడా బాధ్యతేనని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నాయని ముఖ్యమంత్రి చెప్పిన మాటకు గౌరవం ఇస్తూ రెండేళ్లు సహనంగా వేచి చూసినా హామీల అమలును నిరవధికంగా వాయిదా వేయడం సరికాదని, దశలవారీగైనా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

పీఆర్సీ కమిషన్ ఇప్పటికీ నియమించకపోవడం, కేంద్ర ఉద్యోగులకు డీఏ అమలవుతుండగా రాష్ట్ర ఉద్యోగులకు జాప్యం, ఐఆర్ హామీపై స్పష్టత లేకపోవడం, వేల కోట్ల బకాయిలపై ఎంత ఉంది, ఎప్పుడు, ఏ విధంగా చెల్లిస్తారనే విషయంలో ప్రకటన చేయాలని ఫణిపేర్రాజు ప్రశ్నించారు. హెల్త్ కార్డులు, వైద్య బిల్లులకు శాశ్వత పరిష్కారం చూపాలని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వైద్యం, విద్య, నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగి ఆర్థికంగా చితికిపోతున్నాడని అన్నారు.

కొన్ని టీవీ చర్చల్లో ఉద్యోగులకు హక్కులు లేవన్నట్లు మాట్లాడటం బాధాకరమని బొప్పరాజు, దామోదరరావు అన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే హక్కు, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే హాజరవుతామని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే మొదటి ప్రాధాన్యత అని పారేలక్ష్మి, విజయలక్ష్మి అన్నారు. నిందలు, అపవాదులతో ఉద్యమాన్ని పక్కదారి పట్టించలేరని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు తెలిపారు.

28న జరిగిన రాష్ట్ర సదస్సులో రూపొందించిన ఉద్యమ కార్యాచరణను పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తామని, ప్రభుత్వం పిలిచినప్పుడు చర్చలకు హాజరవడం బాధ్యత అని బొప్పరాజు, దామోదరరావు పేర్కొన్నారు.

సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్.శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.కిశోర్ కుమార్, ఉమెన్ కమిటీ అసోసియేట్ చైర్‌పర్సన్ సైకం శివకుమారెడ్డి, కోశాధికారి డాక్టర్ సాయిలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరి, విఆర్‌వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.అనుపమ, ఎన్టీఆర్ జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, క్యాపిటల్ సిటీ చైర్మన్ పి.రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి మందపాటి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story