
‘‘దుష్యంత్ కుమార్ కు గవర్నర్ పదవి ఇవ్వొద్దు’’
ఇండియా గేట్ వద్ద ఆందోళన చేసిన అంకిత భండారీ తల్లిదండ్రులు, మద్దతు తెలిపిన కాంగ్రెస్
అంకితా భండారీ హత్య కేసులో న్యాయం కోసం పోరాటం మరోసారి ఉధృతమైంది. ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నప్పటికీ, కొద్దిసేపటికే వారిని విడుదల చేశారు. సిక్కిం గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని నిలిపివేయాలని, అంకితా హత్య కేసులో వీఐపీ ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
2022 సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకితా భండారీ హత్యకు గురైంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరిని దోషులుగా తేల్చిన కోర్టు, 2025 మేలో వారికి జీవిత ఖైదు విధించింది. అయితే, ఈ ఘటన వెనుక ఓ వీఐపీ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై కూడా విచారణ జరగాలని అంకితా కుటుంబం కోరుతోంది.
ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అంకితా తల్లిదండ్రులు, పలువురు కార్యకర్తలు నిరసనకు దిగారు. కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు దుష్యంత్ కుమార్ గౌతమ్ గవర్నర్ నియామకంపై ముందుకు వెళ్లవద్దని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మద్దతు తెలిపారు.
బుధవారం రాత్రి నుంచి కొనసాగిన ఆందోళనను గురువారం తెల్లవారుజామున పోలీసులు అడ్డుకున్నారు. అంకితా తల్లిదండ్రులతో పాటు కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, సుప్రియా శ్రీనతే, ఉదయ్ భాను చిబ్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో అంకితా తల్లిదండ్రులను విడుదల చేశారు.
తమ డిమాండ్లపై స్పందించేందుకు ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నట్లు అంకితా తండ్రి ప్రకటించారు. గవర్నర్ నియామకాన్ని నిలిపివేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు, నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఈ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడినప్పటికీ, వీఐపీ ప్రమేయంపై ఉన్న ఆరోపణలపై స్పష్టత రావాలని అంకితా కుటుంబం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించే తీరు, దర్యాప్తులో తదుపరి పరిణామాలు కీలకంగా మారాయి.

