తమిళనాడులో స్టాలిన్ దే మళ్లీ గెలుపు?
x

తమిళనాడులో స్టాలిన్ దే మళ్లీ గెలుపు?

అస్సాంలో బీజేపీ, పశ్చిమ బెంగాల్, కేరళలో హోరాహోరీ, పుదుచ్ఛేరిలో రంగస్వామి హవా


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కొత్త రాజకీయ సమీకరణలు, సినీ నటుడు విజయ్ రాక వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో స్టాలిన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే ఈ అంచనాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

మెజారిటీ ప్రముఖ సర్వే సంస్థలు డీఎంకే కూటమికి మ్యాజిక్ ఫిగర్ (118) కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నాయి.

డీఎంకే విజయానికి కలిసొచ్చే అంశాలు..ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలవారీ నగదు సాయం వంటి పథకాలు డీఎంకేకి బలమైన ఓటు బ్యాంకుని సృష్టించాయి. కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన డీఎంకే కూటమి పటిష్టంగా ఉండటం ప్లస్ అయ్యింది.

ఏఐఏడీఎంకే ఓట్లను విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ చీల్చడం వల్ల పరోక్షంగా డీఎంకే లాభపడుతోందని సర్వేలు విశ్లేషిస్తున్నాయి.

వరుసగా రెండోసారి.. ఒక రికార్డు!

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒకే పార్టీ వరుసగా రెండోసారి అధికారం సాధించడం చాలా అరుదు. 2016లో జయలలిత సాధించిన తర్వాత, ఇప్పుడు స్టాలిన్ ఆ ఘనతను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే, స్టాలిన్ నాయకత్వం మరింత బలపడటమే కాకుండా, జాతీయ రాజకీయాల్లోనూ ఆయన చక్రం తిప్పే అవకాశం ఉంటుంది.

యాక్సిస్ మై ఇండియా వంటి కొన్ని సర్వేలు విజయ్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇచ్చి షాక్ ఇచ్చినప్పటికీ, మెజారిటీ పోల్స్ మాత్రం "స్టాలిన్ ఈజ్ బ్యాక్" అని గట్టిగా చెబుతున్నాయి. మే 4న వెలువడే ఫలితాల్లో ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

Read More
Next Story