ఆ మ‌త్స్య‌కారులు క‌డ‌లిలోనే క‌లిసిపోయారా?
x
బోటు ప్ర‌మాదంలో మృత్యుంజ‌యుడు కారె చిన్న‌ను అంబులెన్స్‌లో త‌ర‌లిస్తున్న దృశ్యం

ఆ మ‌త్స్య‌కారులు క‌డ‌లిలోనే క‌లిసిపోయారా?

నాలుగు రోజుల క్రితం స‌ముద్రంలో బోటు బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో గ‌ల్లంతైన ఆరుగురు మ‌త్స్య‌కారులూ చ‌నిపోయిన‌ట్టు దాదాపు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

విశాఖ తీరానికి సుమారు ప‌ది నాటిక‌ల్ మైళ్ల దూరంలో బోల్తా ప‌డిన మ‌ర‌ప‌డ‌వ‌లోని మ‌త్స్య‌కారుల ఆచూకీ నాలుగు రోజులైనా ల‌భించ‌లేదు. ఈ ప్ర‌మాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన ఒకే ఒక్క‌డు, ఆ బోటు య‌జ‌మాని కారె చిన్న క‌థ‌నం ప్ర‌కారం గ‌ల్లంతైన ఆరుగురు జాల‌ర‌ర్లు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆ మ‌త్స్య‌కార కుటుంబాల్లో తీవ్ర అల‌జ‌డి రేపుతోంది.


బాధిత కుటుంబీకుల‌ను ప‌రామ‌ర్శిస్తున్న మ‌త్స్య‌శాఖ క‌మిష‌న‌ర్ రామ్‌శంక‌ర్ నాయ‌క్

ఆ మ‌త్స్య‌కారులు చ‌నిపోయారా?
ఈనెల ఒక‌టో తేదీన విశాఖ ఫిషింగ్ హార్బ‌ర్ నుంచి ఇండ్ ఏపీ0ఎంఎం వీ5-83 అనే అనే మ‌ర‌బోటులో ఏడుగురు మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. నాలుగో తారీఖు సాయంత్రం తిరుగు ప్ర‌యాణంలో వీరి బోటు అల‌ల ఉధృతికి బోల్తా ప‌డింది. దీంతో అందులోని మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో ప‌డిపోయారు. ఆ మ‌ర్నాడు ఉద‌యం వ‌ర‌కు అతిక‌ష్ట‌మ్మీద బోల్తా ప‌డిన బోటుపైనే గ‌డిపిన వీరు కొంత‌దూరం ఈదుకుంటూ వెళ్లారు. ఒక్కొక్క‌రుగా ఈద‌లేక స‌ముద్రంలోనే త‌న క‌ళ్లెదుటే క‌నుమ‌రుగ‌య్యార‌ని కారె చిన్న రోదిస్తూ తెలిపాడు. తానొక్క‌డినే అక్క‌డ‌కు స‌మీపంలో లంగ‌రు వేసి ఉన్న‌ మ‌ర్చంట్ నౌక తాడు సాయంతో చేరుకోవ‌డంతో నౌక సిబ్బంది ర‌క్షించార‌ని చెప్పాడు. త‌మ వారెవ‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేద‌ని చిన్న చెప్ప‌డంతో వారంతా చ‌నిపోయి ఉంటార‌ని భావిస్తున్న‌ట్టు విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మ‌ల్యే వంశీకృష్ణ శ్రీ‌నివాస్ మీడియాకు వెల్ల‌డించారు. అయితే మ‌త్స్య‌కారుల మృత‌దేహాలు దొరికే దాకా అధికారికంగా ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించే వీలుండ‌దు. మ‌రోవైపు ఒక‌వేళ ఈ మ‌త్స్య‌కారులు చ‌నిపోయి ఉంటే వారి మృత‌దేహాలు తీరానికి కొట్టుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున త‌నిఖీలు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ అభిషిక్త్ కిషోర్‌ తీర ప్రాంత గ‌స్తీ ద‌ళాల‌ను ఆదేశించారు.
కొనసాగుతున్న గాలింపు చ‌ర్య‌లు..
గ‌ల్లంతైన మ‌త్స్య‌కారుల కోసం అధికారులు గాలింపు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికే మూడు రోజుల నుంచి రెండు కోస్ట్‌గార్డు నౌక‌లు ఐసీజీఎస్ క‌న‌క ల‌త బారువా, ఐసీజీఎస్ వీర‌, మ‌రో రెండు నేవీ యుద్ధ‌నౌక‌లతో పాటు కోస్ట్‌గార్డ్‌కు చెందిన డోర్నియ‌ర్ ఎయిర్‌క్రాఫ్ట్‌, నేవీ హెలికాప్ట‌ర్లు (సీకింగ్‌, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్ట‌ర్లు) రెండు ఈ గాలింపు చ‌ర్య‌ల్లో పాల్గొన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు. క‌నీసం బోటు జాడ కూడా ల‌భించ‌లేదు. గ‌ల్లంతైన జాల‌ర్ల‌ జాడ తెలిసే వ‌ర‌కు రెస్క్సూ ఆప‌రేష‌న్ నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. విశాఖ రేంజి ఐజీ గోపీనాథ్ జెట్టీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఇందులో నేవీ, కోస్ట్‌గార్డ్‌, మెరైన్ పోలీసులు, మ‌త్స్య‌శాఖ అధికారులు పాలుపంచుకుంటున్నారు. మ‌రోవైపు గ‌ల్లంతైన మ‌త్స్య‌కారుల ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అలాగే దీనిపై ఆర్డీవో, ఏసీపీ, మ‌త్స్య‌శాఖ ఏడీల‌తో కూడిన త్రీమెన్ క‌మిటీని నియ‌మించారు.
బాధిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం..
బోటు బోల్తా ప‌డి నాలుగు రోజులైనా గ‌ల్లంతైన మ‌త్స్య‌కారుల ఆచూకీ దొర‌క‌క పోవ‌డం, ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డిన బోటు ఓన‌రు కారె చిన్న చెబుతున్న దాని ప్ర‌కారం ఆ మ‌త్స్య‌కారులు మ‌ర‌ణించి ఉంటార‌న్న అభిప్రాయానికి ఇటు ప్ర‌జాప్ర‌తినిధులు, అటు అధికారులు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో బాధిత మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ.10 ల‌క్ష‌ల చొప్పున త‌క్ష‌ణ సాయంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ సొమ్మును వారికి అంద‌జేయాల‌ని విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించిన‌ట్టు వ్య‌వ‌సాయ‌, మ‌త్స్య‌శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇలావుండ‌గా త్రీమెన్ క‌మిటీ నివేదిక /స‌ర్టిఫికెట్ ఆధారంగా గ‌ల్లంతైన మ‌త్స్య‌కారులు ఒక్కొక్క‌రికి గ్రూపు యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ స్కీం కింద రూ.5 ల‌క్ష‌ల చొప్పున అంద‌జేయ‌నున్నారు.
జాడ‌లేకుండా పోయిన ఆ మ‌త్స్య‌కారులు..
బోటు బోల్తా ప‌డ‌న ప్ర‌మాదంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురం మండ‌ల‌లం ముక్కాం గ్రామానికి చెందిన ఐదుగురు, విశాఖ జిల్లా భీమిలి మండ‌లం పెద‌నాగ‌మ‌య్య‌పాలేనికి చెందిన ఒక‌రు ఉన్నారు. వీరిలో కె.చిన్న‌య్య‌, కె.గ‌ర‌గ‌య్య‌, ఎ.అప్ప‌ల‌రాజు, ఆర్‌. బండియ్య‌, కె. చ‌న్న‌య్య‌, కె.సీతోడు గ‌ల్లంత‌య్యారు. బోటు య‌జ‌మాని కారె చిన్న ఒక్క‌డే మృత్యుంజ‌యుడిగా మిగిలాడు. మిగిలిన ఆరుగురూ నాలుగు రోజులుగా గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నా వారి జాడ మాత్రం కాన‌రావ‌డం లేదు. కారె చిన్న వ‌చ్చే వ‌ర‌కు బాధిత కుటుంబాలు త‌మ వారు ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ‌తారేమోన‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. స‌ముద్రంలో ప్ర‌మాదం జ‌రిగిన తీరు, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను తేట‌తెల్లం చేయ‌డంతో ఈ చిగురాశ‌లు కూడా వ‌దులుకున్నారు. త‌మ వారిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు. క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, రాజ‌కీయ పార్టీల నేత‌లు, మ‌త్స్య‌కార నాయ‌కులు వారిని ఓదారుస్తున్నారు.
Read More
Next Story