
ధార్వాడ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు, ఎమ్మెల్యేకి జీవిత ఖైదు
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు!
రాజకీయ హత్య కేసులో కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ధార్వాడ్ రూరల్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి చుక్కెదురైంది. బీజేపీ నేత యోగేష్ గౌడ హత్య కేసులో కులకర్ణిని దోషిగా నిర్ధారించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం, ఆయనతో పాటు మరో 16 మందికి శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
2016 జూన్ 15న ధార్వాడ్‌లోని సప్తపూర్ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న బీజేపీ జిల్లా పంచాయతీ సభ్యుడు యోగేష్ గౌడను దుండగులు అతికిరాతకంగా నరికి చంపారు.
ధార్వాడ్ జిల్లాలో యోగేష్ గౌడ ఎదుగుతున్న రాజకీయ ప్రాబల్యాన్ని సహించలేక, అప్పట్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న వినయ్ కులకర్ణి ఈ హత్యకు ప్లాన్ చేశారని సీబీఐ అభియోగం మోపింది.
వినయ్ కులకర్ణి, ఇతర నిందితులపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) కింద నేరం రుజువైంది.
సమాజానికి గట్టి సందేశం..
ఈ కేసు విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల, ఎస్. హేమహద్ తమ వాదనలను వినిపిస్తూ.. ఒక శాసనసభ్యుడే ఇలాంటి దారుణానికి ఒడిగడితే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే గరిష్ట శిక్ష విధించాలని కోరారు. న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఈ వాదనలతో ఏకీభవిస్తూ నిందితులకు యావజ్జీవ శిక్ష ఖరారు చేశారు.
సుదీర్ఘ న్యాయపోరాటం - సీబీఐ దర్యాప్తు:
మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినప్పటికీ, బాధితుల కుటుంబం, బీజేపీ నేతల ఒత్తిడి మేరకు 2019లో అప్పటి ప్రభుత్వం కేసును సీబీఐకి బదిలీ చేసింది. 2020 నవంబర్‌లో సీబీఐ కులకర్ణిని అరెస్ట్ చేసింది. ఆయన 9 నెలల పాటు జైల్లో ఉండి సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందారు.
అయితే సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలతో 2025 జూన్‌లో ఆయన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. విచారణ వేగవంతం చేసిన ప్రత్యేక కోర్టు చివరకు నేడు తుది తీర్పు ఇచ్చింది.
ఎమ్మెల్యే పదవికి ఎసరు?
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడిన ప్రజాప్రతినిధులు తక్షణమే తమ పదవిని కోల్పోతారు. జీవితఖైదు పడిన నేపథ్యంలో వినయ్ కులకర్ణి ఎమ్మెల్యే పదవి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story

