అమరావతిలో రూ. 2,540 కోట్లతో అభివృద్ధి పనులు
x

అమరావతిలో రూ. 2,540 కోట్లతో అభివృద్ధి పనులు

పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీ రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 26కు పైగా కీలక అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, రాజధాని పనులను పరుగులు పెట్టించేలా రూ. 2,540 కోట్ల భారీ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఆగిపోయిన సచివాలయ పనుల పునరుద్ధరణ నుంచి వరద రక్షణ చర్యల వరకు, మౌలిక వసతుల కల్పన నుంచి ఉద్యోగుల పదోన్నతుల వరకు ప్రభుత్వం అన్ని రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలతో అమరావతి మళ్ళీ విశ్వనగర నిర్మాణ దిశగా అడుగులు వేయడంతో పాటుగా పోలవరం నిర్వాసితులకు కూడా ఆర్థిక ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

అమరావతి అభివృద్ధికి రూ. 2,540 కోట్లు
రాజధాని అమరావతి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసేలా కేబినెట్ రూ. 2,540 కోట్ల భారీ నిధులను మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో సచివాలయ భవనం, జీఏడీ (GAD), హెచ్‌ఓడీ (HOD) టవర్లకు సంబంధించిన గ్లాస్ క్లాడింగ్, ఫసాడ్, గ్లేజింగ్ పనులను పూర్తి చేయనున్నారు. వీటితో పాటు, భవిష్యత్తులో వరద ముప్పు పొంచి ఉండకుండా కృష్ణానది వెంబడి రూ. 443 కోట్లతో ఫ్లడ్ ప్రొటెక్షన్ (వరద రక్షణ గోడ) పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మౌలిక వసతులు.. పరిపాలనా భవనాలు
పరిపాలనా నగరిలో కీలకమైన అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ స్ట్రక్చర్ పనుల కోసం రూ. 798 కోట్లు కేటాయించగా, ఉండవల్లి జోన్ (LPS Zone-11)లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ. 580 కోట్లు కేటాయించారు. అలాగే, రాజధాని ప్రాంతంలో అడ్డంకిగా ఉన్న 220 కేవీ విద్యుత్ లైన్ల రీరూటింగ్ కోసం రూ. 1,180 కోట్లు వెచ్చించనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రతిష్టాత్మక ట్విన్ టవర్స్ నిర్మాణానికి రూ. 1208.41 కోట్లు వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
రైతులకు ఊరట .. నిబంధనల్లో సవరణలు
రాజధాని కోసం భూములిచ్చిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మెట్ట భూములకు ఎకరాకు రూ. 40,000, జరీబు భూములకు రూ. 60,000 చొప్పున కౌలు పెంచేందుకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా, ప్రతి ఏటా మెట్ట భూములకు రూ. 3,000, జరీబు భూములకు రూ. 5,000 చొప్పున పదేళ్ల పాటు కౌలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు నిబంధనలను కూడా సరళతరం చేస్తూ సవరణలు చేశారు.
పోలవరం బాధితులు .. ఉద్యోగుల ప్రమోషన్లు
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పట్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితుల గృహ యూనిట్ నిర్మాణ ఖర్చును పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు, పోలీస్ శాఖలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) 2000 బ్యాచ్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తూ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో 21 కొత్త పోస్టుల సృష్టికి అంగీకారం తెలిపారు.
ఇతర కీలక నిర్ణయాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ వైభవం ఉట్టిపడేలా కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ. 124.5 కోట్లు కేటాయించారు. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు భూమి కేటాయింపుతో పాటు, మార్క్‌ఫెడ్‌కు రూ. 1,800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్‌కు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును దక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేబినెట్ ప్రత్యేకంగా అభినందించింది.
Read More
Next Story