విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వని తమిళనాడు గవర్నర్
x

విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వని తమిళనాడు గవర్నర్

ముందు ఇచ్చిన అపాయింట్మెంట్ ను రద్దు చేసిన గవర్నర్ కార్యాలయం,


తమిళనాట రాజకీయాలు అంతకంతకూ ఉత్కంఠను పెంచేస్తున్నాయి. గంటకో తీరుగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం చికాకులు ఎదుర్కొంటున్నారు. టీవీకే పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మద్దతు ప్రకటించాయి. ఇప్పుడే వీసీకే మద్దతు ప్రకటిస్తూ లేఖ విడుదల చేసింది. దీంతో విజయ్ పట్టాభిషేకానికి ఆటంకాలు తొలగిపోయాయి. అయితే గవర్నర్ మరోసారి మోకాలడ్డినట్టు తెలుస్తోంది.
తమిళనాడులో విజయ్‌ (Vijay) ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. నిజానికి శనివారం సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ ను విజయ్ కలుస్తారని అనుకున్నారు. ఆమేరకు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అయితే అది చివరి నిమిషంలో రద్దు అయింది. దీంతో గవర్నర్ విశ్వనాథన్ అర్లేకర్ మళ్లీ ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
తాజాగా విజయ్ పార్టీకి వీసీకే (Viduthalai Chiruthaigal Katchi) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీవీకే పార్టీ నేత ఆదవ అర్జునకు.. వీసీకే నేత తిరుమావళవన్ లేఖ ఇచ్చారు. అలాగే ఐయూఎంల్‌ కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో సంఖ్యాబలం 120కి చేరింది.
మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగా.. టీవీకే (TVK) అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీ మార్క్‌కు పది అడుగుల దూరంలో నిలిచిపోయింది. అనంతరం కాంగ్రెస్‌ (5), వామపక్షాలు (4) మద్దతు ఇస్తామని ముందుకువచ్చాయి. వీసీకే (2) కూడా మద్దతు ఇస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఈ రోజు లేఖ ఇచ్చింది. విజయ్ రెండు చోట్లా గెలవడంతో టీవీకే సంఖ్యాబలం 107. ఇక, ఇద్దరు సభ్యులున్న ఐయూఎంఎల్‌ నిన్న మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల మద్దతుతో టీవీకే శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
లోక్‌భవన్‌కు విజయ్‌..
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం రావడంతో విజయ్ మరోసారి లోక్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆయన్ను కోరనున్న తరుణంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ రద్దు అయినట్టు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ వెనుదిరిగినట్టు తెలుస్తోంది. గవర్నర్ విశ్వనాథన్ అర్లేకర్ కేరళ వెళ్లనున్నందున విజయ్ అపాయింట్‌మెంట్ రద్దు అయినట్టు తెలుస్తోంది. తిరిగి ఎప్పుడు వీళ్లిద్దరూ కలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read More
Next Story