
ప్రముఖ న్యాయకోవిదుడు ప్రశాంత్ భూషణ్
"విజయ్ ను పిలకపోవడం ప్రజా తీర్పును గవర్నర్ అవమానించడమే!"
గవర్నర్ వ్యవస్థపై నిప్పులు చెరిగిన ప్రశాంత్ భూషణ్!
దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉందని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజా తీర్పును కాలరాస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
స్వతంత్రంగా ఉంటేనే మనుగడ..
ఎన్నికల సంఘం (EC), దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాల అదుపులో ఉండకూడదని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలను భయపెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల ఓట్లతో కాకుండా ఈవీఎంలే విజయాన్ని డిసైడ్ చేస్తున్నాయని, ఈసీ పారదర్శకత లోపించిందని దుయ్యబట్టారు.
తమిళనాడు తీర్పును కాలరాస్తున్న గవర్నర్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును గవర్నర్ వ్యవస్థ అగౌరవపరుస్తోందని ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అత్యంత స్పష్టంగా ఉంది. 234 స్థానాలున్న రాష్ట్రంలో విజయ్ నేతృత్వంలోని TVK ఏకంగా 108 సీట్లు గెలుచుకుని, 1.7 కోట్ల ఓట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంటే 35 శాతం ఓటర్లు తమ భవిష్యత్తును TVK చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తమిళ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు, ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా వెలువడిన ఈ తీర్పును గౌరవించాల్సింది పోయి, కేంద్రం నియమించిన గవర్నర్ అర్లేకర్ ద్వారా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోగల సత్తా ఉన్న పార్టీని లేదా కూటమిని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. కానీ, తమిళనాడులో గవర్నర్ మాత్రం "ముందు నా దగ్గర (రాజ్ భవన్‌లో) మెజారిటీ నిరూపించుకోండి, అప్పుడే ప్రమాణ స్వీకారానికి పిలుస్తా" అంటూ రాజ్యాంగంలో లేని కొత్త నిబంధనలను తెరపైకి తెస్తున్నారు.
2006లో 'రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గవర్నర్ గాలికి వదిలేశారు. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా మారి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పినా, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
గతంలో బీజేపీకి లబ్ధి చేకూరే సమయంలో గవర్నర్ల తీరు ఎంత వేగంగా ఉండేదో మనం చూశాం. 2018లో కర్ణాటకలో యడ్యూరప్ప వద్ద 105 సీట్లు మాత్రమే ఉన్నప్పటికీ, అప్పటి గవర్నర్ ఎటువంటి షరతులు లేకుండా ఆయన్ను వెంటనే ప్రమాణ స్వీకారానికి పిలిచారు. అలాగే 2019లో మహారాష్ట్రలో తెల్లవారుజామున 5:30 గంటలకే మెజారిటీ లేని ఫడ్నవీస్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన ఉదంతం దేశం ఇంకా మర్చిపోలేదు. గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద పార్టీని కాదని బీజేపీ అనుకూల కూటములకు గవర్నర్లు పట్టం కట్టారు. కానీ, ఇప్పుడు తమిళనాడులో TVK వంటి పార్టీ విషయంలో మాత్రం నిబంధనల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.
చివరికి ఇది కేవలం ఒక పార్టీకో, నాయకుడికో సంబంధించిన విషయం కాదు. 1.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా వ్యక్తం చేసిన అభీష్టాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి తొక్కిపెట్టాలని చూడటం సమాఖ్య వ్యవస్థను ఖూనీ చేయడమే. రాజ్యాంగం అనేది ఒక పార్టీ సొత్తు కాదు, అది కోట్లాది మంది ప్రజల నమ్మకం. నేడు తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న ఈ తీరు, రేపు మరే ఇతర రాష్ట్రానికైనా పాకవచ్చు. అందుకే ఈ అప్రజాస్వామిక చర్యలను దేశంలోని ప్రతి పౌరుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం మెజారిటీ నిరూపించుకోగల పార్టీని ఆహ్వానించాలి. కానీ గవర్నర్ అర్లేకర్ "ముందు రాజ్ భవన్‌లో మెజారిటీ చూపండి, అప్పుడే ప్రమాణ స్వీకారానికి పిలుస్తా" అంటూ కొత్త నిబంధనలు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని భూషణ్ పేర్కొన్నారు.
దొంగల రాజ్యమేలుతున్నారు: ఎమ్మెల్యే కూనంనేని
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలో మత రాజకీయాలు చేస్తూ దొంగలు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. పేద ప్రజల కోసం పోరాడే వారిని జైల్లో పెడుతూ, హంతకులకు రాజ్యాధికారం కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
1.7 కోట్ల మంది ఓటర్ల అభీష్టాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి (గవర్నర్) తొక్కిపెట్టాలని చూడటం సమాఖ్య వ్యవస్థను ఖూనీ చేయడమేనని మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం అనేది ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని, నేడు తమిళనాడులో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు ప్రశ్నించాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది.
Next Story

