ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: 9 మంది మృతి
x

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: 9 మంది మృతి

ఏసీ పేలుడే కారణమా? కొనసాగుతోన్న దర్యాప్తు..


Click the Play button to hear this message in audio format

ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నాలుగు అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగడంతో కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 3.48 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనంలోని రెండో, మూడో, నాలుగో అంతస్తుల్లో మంటలు వ్యాపించడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.

ప్రాథమికంగా ఏసీ పేలుడు కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, అసలు కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.

సహాయక చర్యలు..

మంటలను అదుపులోకి తేవడానికి మొత్తం 12 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో 10 నుంచి 15 మంది వరకు నివాసితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

“అగ్నిమాపక సిబ్బంది సుమారు 10 నుంచి 15 మందిని రక్షించారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించాం,” అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన వారిని గురు తేగ్ బహదూర్ హాస్పిటల్‌కు తరలించారు.

మృతుల వివరాలు..

ఈ ఘటనలో మృతుల వివరాలు కూడా వెల్లడయ్యాయి. రెండో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వారిలో అరవింద్ జైన్ (60), అనితా జైన్ (58), నిశాంత్ జైన్ (35), అంచల్ జైన్ (33), ఆకాష్ జైన్. మూడో అంతస్తులో మరో కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. నితిన్ జైన్ (50), షైలీ జైన్ (48), సమ్యక్ జైన్ (25). మొదటి అంతస్తులో శిఖా జైన్ (45) మృతి చెందగా, ఆమె భర్త నవీన్ జైన్ గాయపడ్డారు.

భద్రతా సంస్థల చర్యలు..

ఈ ఘటనలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను తరలించడం, ప్రాంతాన్ని ఖాళీ చేయించడం వంటి పనులు వేగంగా నిర్వహించారు.

కొనసాగుతోన్న దర్యాప్తు ..

ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల అసలు కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్కనారు. ఏసీ పేలుడు కోణం సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. “అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది,” అని అధికారులు తెలిపారు.

ఈ ఘటన ఢిల్లీలో భవన భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

Read More
Next Story