నల్లమలను చెంచు రిజర్వ్‌గా ప్రకటించండి!
x
నల్లమల అడవుల్లో చెంచులు

నల్లమలను చెంచు రిజర్వ్‌గా ప్రకటించండి!

చెంచుల ప్రయోజనాలను రక్షించడానికి నల్లమల అడవుల్లో చెంచుల నివాస ప్రాంతాన్ని చెంచు రిజర్వుగా ప్రకటించాలని ఈఏఎస్‌ శర్మ ఐఏఎస్ రాష్ట్రపతికి లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత్వం చెంచులను ప్రత్యేకంగా ‘అతి సున్నిత స్థితిలో ఉన్న గిరిజన సమూహంగా గుర్తించిందని భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ పూర్వ కమిషనర్‌ ఈఏఎస్‌ శర్మ పేర్కొన్నారు. దీని దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలో విస్తరించిన నల్లమల అడవులో నివసించే ఆదివాసీ సమూహమైన చెంచు రాజ్యాంగ బద్ధ హక్కులను రక్షించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యాన్ని కోరుతూ ఆయన ఆమెకు లేఖ రాశారు. ఆ లేఖలో శర్మ పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.


భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ

‘నల్లమల అడవుల్లో చెంచుల నివాస ప్రాంరతాన్ని రాజ్యాంంలోని ఐదవ షెడ్యూలు ప్రకారం షెడ్యూలు ఏరియాలో భాగంగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో చెంచులకు ప్రత్యేక హక్కులున్నాయి. ఐదవ షెడ్యూల్‌లోని క్లాజ్‌–5 ప్రకారం.. అటవీ చట్టాలు సహా ఏ చట్టాన్నైనా షెడ్యూల్డు ఏరియాల్లో అమలు చేసేముందు స్థానిక ఆదివాసీల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం దాన్ని సవరించగలదు. షెడ్యూల్డ్‌ ఏరియాలకు పంచాయతీల విస్తరణ చట్టం 1996 ప్రకారం షెడ్యూల్డు ఏరరియాల్లో ఏ ప్రాజెక్టు లేదా పథకాన్ని చేపట్టే ముందు స్థానిక ఆదివాసీ గ్రామసభలను తప్పనిసరిగా సంప్రదించాలి. అలాగే స్థానిక పంచాయతీల్లో కనీసం 50 స్థానాలు ఆదివాసీలకు కేటాయించాలి.
అధికారుల నిర్లక్ష్యంతోనే గిరిజనేతరుల చొరబాటు..
షెడ్యూల్డు ట్రైబ్స్, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల చట్టం 2006 ప్రకారం షెడ్యూల్డు ఏరియాల్లోను, వాటి వెలుపలనూ నివసించే ఆదివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసులకు, వారు తరతరాలుఆ ఆధారపడుతున్న అటవీ వనరులపై సామూహిక హక్కులు కూడా ఈ చట్టం కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం షెడ్యూల్డు ఏరియాల్లో భూములను ఆక్రమించి ఉన్న గిరిజనేతరులు, ఆ భూములపై తాము ఆ చట్టాలు అమలులోకి రాకముందే అనుక తరాలుగా ఉన్నామని నిరూపించాలి. అలాంటి నిరూపణలో విఫలమైతే వారు ఆ ఆక్రమణను కొనసాగించడానికి అనుమతించబడరు. అథికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పై చట్టాల ఉల్లంఘనలు విస్తృతంగా జరిగి ఆదివాసీలు నష్టపోతున్నారు. గిరిజనేతరులు భారీగా షెడ్యూల్డు ఏరియాలో చొరబడ్డారు.
చెంచులకు మూడు రకాల ముప్పు..
ప్రస్తుతం చెంచులు మూడు రకాల ముప్పును ఎదుర్కొంటున్నారు. మొదటిది పంచాయతీల్లో వారి రాజకీయ స్థలాన్ని గిరిజనేతరులు ఆక్రమించే ప్రయత్నం. రెండవది గిరిజనేతరులు వారి భూములను ఆక్రమించడం. మూడవది ‘టైగర్‌ రిజర్వ్‌’ పేరిట వారిని ఆ ప్రాంతం వెలుపలికి పునరావాసం పేరుతో తరలించే ముప్పు. పునరావాసం అంటే చెంచులను వారు శతాబ్దాలుగా జీవిస్తూ తమ జీవనాధారాన్ని నిర్మించుకున్న అటవీ నివాస ప్రదేశం నుంచి పీకి తీసివేయడమే. టైగర్‌ రిజర్వ్‌ ఉందనే సాకుతో స్థానిక అధికారులు చెంచులకు, ఇతరులకు అందిస్తున్న అభివృద్ధి ప్రయోజనాలను పూర్తిగా అందించలేకపోతున్నారు. అథికారులు చెంచులకంటే వన్యప్రాణులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ చెంచుల పునరావాసాన్నే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు చెంచుల హక్కులకు నష్టం కలుగుతుంది.
నల్లమల చెంచులు ఎదుర్కొంటున్నది అదే..
+ నేడు నల్లమల చెంచులు కూడా ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. టైగర్‌ రిజర్వ్‌ సమగ్రతను కాపాడటానికి చెంచులను బలవంతంగా వారి నివాస ప్రాంతం నుంచి తరలించాలా?
ఇతరుల ప్రమేయం లేకుండా చెంచులతో వారి గ్రామ సభల ద్వారా అధికారులు నేరుగా సంభాషించి, వారి భావాలు, ఆవేదనలు అర్థం చేసుకుని, వారికి ఉన్న చోటనే అభివృద్ధి ఫలాలు అందించలేరా?
+ ఎఫ్‌ఆర్‌ఏలో పేర్కొన్నట్టుగా వారికి అటవీ వనరులపై వ్యక్తిత, సామూహిక హక్కులు మంజూరు చేయలేరా?
+ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం వారికి కలిగిన జీవన హక్కును రక్షించలేరా?
మీ దృష్టికి ప్రొఫెసర్‌ నివేదిక..
ఈ సందర్భంలో స్వాతంత్య్రానికి ముందు చెంచుల మధ్య నివసించిన ప్రముఖ మానవ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ క్రిష్టోఫ్‌వాన్‌ ప్యూరర్‌ హైమెండార్ప్‌ రచించిన ’అబొరిజనల్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌–ద చెంచూస్‌’ అనే ప్రసిద్ధ నివేదికను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే? నల్లమల అడవుల్లోని చెంచుల నివాస ప్రాంత్నా టైగర్‌ రిజర్వ్‌గా ప్రకటించడానికి బదులు ‘చెంచు రిజర్వ్‌’గా ప్రకటించాలని ప్రొఫెసర్‌ హైమెండార్ప్‌ సిఫార్సు చేశారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్థానిక ఆదివాసీల సంక్షేమం, హక్కులను కాపాడటానికి ఇటువంటి రక్షణాత్మక నిబంధన ఇప్పటికే అమలులో ఉంది. ‘అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల (ఆదిమ తెగల రక్షణ) నిబంధన 1956 ప్రకారం భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 243(2) కింద జారీ చేసిన రాష్ట్రపతి నిబంధన ద్వారా దీవుల్లోని విస్తృత అటవీ ప్రాంతాన్ని ట్రైబల్‌ రిజర్వుగా ప్రకటించారు.
గౌరవనీయ రాష్ట్రపతి గారూ..
నల్లమల అడవుల్లోని చెంచు నివాస ప్రాంతాన్ని ‘చెంచు రిజర్వ్‌’గా ప్రకటించే ఉద్దేశంతో ఒక రాష్ట్రపతి నిబంధన జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే ఐదవ షెడ్యూలులోని క్లాజ్‌5లో ఉద్దేశించిన విధంగా అడవులకు సంబంధించిన చట్టాలను చెంచుల సంక్షేమం, హక్కులకు అనుగుణంగా సవరించాలని మీరు ఆదేశాలు జారీ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఈఏఎస్‌ శర్మ ఆ లేఖలో వివరించారు.
Read More
Next Story