
మిస్టరీగా మారిన విజయవాడ మెడికో మృతి
విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
రేపటి పౌరులకు ప్రాణదానం చేయాల్సిన ఆ అనస్తీషియా వైద్యురాలు.. అదే ఆసుపత్రి ప్రాంగణంలో అనంతలోకాలకు వెళ్లడం విజయవాడలో పెను సంచలనం సృష్టించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ ఫైనలియర్ చదువుతున్న దీపిక (26), విధి నిర్వహణలో ఉండగానే ఆపరేషన్ థియేటర్ బల్లపై విగతజీవిగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆకలిగా ఉందంటూ తోటి విద్యార్థినితో భోజనం తెప్పించుకున్న కొద్దిసేపటికే, ఆరోగ్యం బాగోలేదని ఇంజక్షన్ చేయించుకున్న ఆమె.. అర్థరాత్రి వేళ శవమై కనిపించడం పెను మిస్టరీగా మారింది. ఈ మృతి వెనుక ఉన్న అసలు కారణాలేమిటి? అది అనారోగ్యమా, ఆత్మహత్యనా లేక చికిత్సలో జరిగిన పొరపాటా? అనే ప్రశ్నలు ఇప్పుడు విజయవాడ నగరాన్ని కుదిపేస్తున్నాయి.
ఆ రాత్రి ఏం జరిగింది?.. మిస్టరీగా మారిన చివరి క్షణాలు
దీపిక మృతికి ముందు ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన పరిణామాలు గమనిస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు చిరునవ్వుతో విధుల్లో చేరిన ఆమె, మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు రోగులకు సేవలు అందించాల్సి ఉంది. రాత్రి సమయం కావడంతో ఆకలిగా ఉందంటూ తోటి విద్యార్థిని ద్వారా ఆహారం తెప్పించుకున్నారు. అయితే, భోజనం చేసిన కొద్దిసేపటికే ఒంట్లో నలతగా ఉంది అని చెప్పడంతో, మరో వైద్య విద్యార్థిని ఆమెకు ఒక ఇంజక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విశ్రాంతి కోసం ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన దీపిక, మళ్ళీ బయటకు రాలేదు. రాత్రి 11:30 గంటల సమయంలో థియేటర్ లోపల ఆపరేషన్ బల్లపై ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి తోటి సిబ్బంది హతాశులయ్యారు. పరీక్షించి చూడగా అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ శవమై కనిపించడం ఆసుపత్రి వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, ఆ ఇంజక్షన్ లో ఏముంది? ఆమె మరణానికి అసలు కారణం ఏమిటి? అనే సందేహాలను తెరపైకి తెస్తోంది.
పోలీసుల దర్యాప్తు .. సీసీ ఫుటేజ్ పరిశీలన
సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో కలిసి సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇది ఆత్మహత్యనా లేక ఇంజక్షన్ వికటించడం వంటి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

