ఏపీలో 652 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
x

ఏపీలో 652 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు

బాధితుల నుంచి ఇప్పటివరకు ఏకంగా 9.29 లక్షల కాల్స్ వచ్చాయి.


ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న దోపిడీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో దిగ్భ్రాంతికరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రజల నుంచి నేరగాళ్లు దాదాపు రూ.652 కోట్లు కొల్లగొట్టినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. ఈ నేపథ్యంలో సైబర్ దొంగల ఆట కట్టించేందుకు పటిష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

1930 కి 9 లక్షల కాల్స్
రాష్ట్రంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అధికారులు వివరించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి బాధితుల నుంచి ఇప్పటివరకు ఏకంగా 9.29 లక్షల కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ అతిపెద్ద ఆర్థిక నేరంగా రూపుదాల్చాయని అధికారులు తెలిపారు. వీటితో పాటు పిషింగ్, విషింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు మోసాలు, ఆన్‌లైన్ లోన్ ఫ్రాడ్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ ల ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున సొమ్ము కోల్పోతున్నారు.
గోల్డెన్ అవర్ రక్షణ.. రూ.116 కోట్లు సేఫ్
సైబర్ నేరం జరిగిన వెంటనే స్పందించడం ఎంత కీలకమో ఈ గణాంకాలు చెబుతున్నాయి. నేరం జరిగిన తొలి గంట (గోల్డెన్ అవర్)లో బాధితులు ఫిర్యాదు చేయడం వల్ల, సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం బ్యాంకర్లతో కలిసి సమన్వయంతో వ్యవహరించి ఇప్పటివరకు రూ.116 కోట్ల పైచిలుకు మొత్తాన్ని నేరగాళ్ల చేతికి చిక్కకుండా అడ్డుకోగలిగింది. ఇతరుల బ్యాంక్ ఖాతాలను (Mule Accounts) నేరగాళ్లు వాడకుండా బ్యాంకర్లతో నిరంతరం సమీక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.
మూడు చోట్ల సైబర్ పోలీస్ స్టేషన్లు
నేరాల నియంత్రణ కోసం రాష్ట్రంలో వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో ప్రత్యేక సైబర్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నిరంతరం పని చేస్తోందని, ఏపీ సైబర్ పాలసీ ద్వారా నిందితులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు వివరించారు.
బ్యాంకర్లతో సమన్వయం తప్పనిసరి
సమీక్షలో పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తో పాటు పలు బ్యాంకుల ఉన్నతాధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకర్లు తమ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను పెంచాలని, పోలీసులు, బ్యాంకులు కలిసి పనిచేస్తేనే బాధితుల సొమ్మును కాపాడగలమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఫోరెన్సిక్స్ సలహాదారు కె.పి.సి. గాంధీ కూడా ఈ సమావేశంలో సాంకేతిక అంశాలపై సూచనలు చేశారు.
Read More
Next Story