ఏపీలో మళ్లీ కోవిడ్ కలకలం.. నలుగురి మరణం
హడలెత్తుతున్న జనం, అంత సవ్యంగానే ఉందన్న ఆరోగ్య శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కోవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కేసులు విడివిడిగా ఉన్నాయని, పెద్ద ఎత్తున వ్యాప్తి లేదా క్లస్టర్ రూపంలో లేవని రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కానీ అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, జూన్ 26 నుంచి జూలై 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో నలుగురు కోవిడ్ సోకిన వ్యక్తులు మరణించారు. అయితే, మరణించిన వారందరికీ ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు (కో-మార్బిడిటీలు) ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు కడప జిల్లాలో ముగ్గురు, కాకినాడ జిల్లాలో ఒకరు కోవిడ్ బారిన పడి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ వెల్లడించారు. ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. వైయస్సార్ జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో రెండు, విశాఖ, కాకినాడ జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. అంటే అటు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలోనూ కోవిడ్ విస్తరించింది.
వైద్య ఆరోగ్యశాఖ ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు ఇంతవరకు ఏమీ పట్టించుకోలేదు. వైద్యశాలల్లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు లేవు. అత్యవసర వైద్యానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లు కూడా కోవిడ్ కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదని విజయవాడ ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారులు చెబుతున్నారు.
అయితే, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. వీర పాండ్యన్ మాట్లాడుతూ, ప్రస్తుతం నమోదవుతున్న కేసులు రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని, ఇవి కొత్త కోవిడ్ వ్యాప్తికి సంకేతం కాదన్నారు. రాష్ట్రంలో భయపడాల్సిన పరిస్థితి లేదని, ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని చెప్పారు. ఆసుపత్రులు, వైద్యులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, అవసరమైన మందులు, పరీక్షా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం నమోదవుతున్న వైరస్ వేరియంట్‌ను గుర్తించేందుకు రోగుల నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ పాత్ర ఉందా అనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఆరోగ్య శాఖ ప్రజలకు కొన్ని జాగ్రత్తలు కూడా సూచించింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వృద్ధులు, గర్భిణులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి కోవిడ్ కాలంలో అనుసరించిన సాధారణ జాగ్రత్తలను కొనసాగించాలని అధికారులు కోరుతున్నారు.
అధికారుల అంచనా ప్రకారం ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. అయినప్పటికీ వైరస్‌పై నిరంతర నిఘా కొనసాగిస్తూ, అవసరమైతే మరిన్ని నివారణ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

