సీఎం గారు, ఆ కావేరీ ట్రావెల్స్ ను ఎందుకు రద్దు చేయరు?
x

సీఎం గారు, ఆ కావేరీ ట్రావెల్స్ ను ఎందుకు రద్దు చేయరు?

కావేరీ ట్రావెల్స్ కి చెందిన మరో బస్సు దగ్ధమైంది. ఇటీవలి కాలంలో ఇది నాలుగోది. అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదు


ప్రైవేటు బస్సు యజమానుల ధన దాహానికి సామాన్య ప్రయాణికులు సమిధలవుతున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు భీమవరం అడ్డరోడ్డు వద్ద అగ్నిప్రమాదానికి గురికావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై 36 మంది ప్రయాణికులను కిందికి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది.

ప్రజా సంఘాల నేతల సూటి ప్రశ్నలు..

ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే, ప్రైవేటు ట్రావెల్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. 'పర్యవేక్షణ ఏది? ఫిట్‌నెస్ లేని బస్సులు రహదారులపైకి ఎలా వస్తున్నాయి? ఆర్టీఏ (RTO) అధికారులు తనిఖీలు చేయడం లేదా?' అని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర ప్రశ్నించారు. రవీంద్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు కూడా.
"పదే పదే ప్రమాదాలకు గురవుతున్న కావేరీ వంటి ట్రావెల్స్ పర్మిట్లను ఎందుకు రద్దు చేయడం లేదు? ప్రభుత్వ ప్రేమ ఎవరి కోసం? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు సంస్థలపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ? కఠిన చర్యలు తీసుకోవడానికి అడ్డు ఏమిటి?" అని నిలదీశారు.

గతం నుంచి పాఠాలు లేవు..

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దగ్ధమవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో దివాకర్ ట్రావెల్స్, జబ్బార్ ట్రావెల్స్ వంటి సంస్థల బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు కూడా పెద్దఎత్తున ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో కమిటీలు వేసి, విచారణలు జరిపిన ప్రభుత్వం, కాలక్రమేణా ఆ నివేదికలను అటకెక్కించింది. మళ్ళీ ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ వంతు వచ్చింది.
"ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఒక ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి, ఆ తర్వాత యజమానులతో చేతులు కలపడం అధికారులకు అలవాటుగా మారింది. ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వానికి ప్రైవేటు కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమా?" అని సీఐటీయూ అనుంబంధ ఆర్టీసీ సంఘం ధ్వజమెత్తింది.
సీఐటీయూ చేసిన డిమాండ్ ఏమిటంటే..
కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ జరిపి, తక్షణమే ఆ సంస్థ లైసెన్స్‌ను రద్దు చేయాలి.
రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి.
ప్రయాణికుల భద్రత విషయంలో నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
ప్రకాశం జిల్లా ఘటనలో డ్రైవర్ సమయస్ఫూర్తితో 36 మంది ప్రాణాలు నిలిచాయి కానీ, ప్రతిసారీ అదృష్టం తోడుండదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలకు చెక్ పెట్టకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని వారు స్పష్టం చేస్తున్నారు.
కావేరీ ట్రావెల్స్: వరుస ప్రమాదాల పరంపర
అక్టోబర్ 2025 (కర్నూలు - చిన్నటేకూరు): హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు చిన్నటేకూరు వద్ద బైక్‌ను ఢీకొట్టి అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘోర దురంతంలో 19 మంది ప్రయాణికులతో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తి, మొత్తం 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ బస్సుపై అంతకుముందే అతివేగం, అజాగ్రత్తగా నడపడం వంటి కారణాలతో 23 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది.
నవంబర్ 2025 (నందిగామ): హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు, ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
జనవరి 2026 (కర్నూలు - టిడ్కో కాంప్లెక్స్): పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ప్రజా సంఘాల ఆగ్రహం..
"చిన్నటేకూరు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు పోయినా, యజమానిపై చలానాలు గుట్టలుగా పేరుకుపోయినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?" అని నేతలు ప్రశ్నిస్తున్నారు.
వరుసగా భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థల లైసెన్సులను రద్దు చేయకుండా కేవలం జరిమానాలతో సరిపెట్టడం వెనుక మతలబు ఏంటని వారు నిలదీస్తున్నారు.
స్లీపర్ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పనిచేయకపోవడం వంటి ఉల్లంఘనలు ఉన్నా ఆర్‌టీఓ అధికారులు క్లియరెన్స్ ఎలా ఇస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.
డ్రైవర్ల పనిగంటలు: ప్రైవేటు సంస్థలు డ్రైవర్లచేత విశ్రాంతి లేకుండా పనులు చేయించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై నిఘా ఏదని ప్రశ్నిస్తున్నారు.
Read More
Next Story