
సామర్లకోట ప్రాంతంలోని వేట్లపాలెంలో చంద్రబాబు పర్యటన
సెల్ ఫోన్లు, కార్ల హెడ్ లైట్ల వెలుగులో చంద్రబాబు పరామర్శ
చీకటిలోనూ బాధితుల చెంతకు సీఎం: వేట్లపాలెం మృతులకు ప్రధాని ఎక్స్‌గ్రేషియా
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని శనివారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
అప్పటికే చీకటి పడడంతో ఆయన కారు హెడ్ లైట్లు, సెల్ ఫోన్ లైట్లు, పెన్ టార్చ్ లైట్ల వెలుగుల్లో ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఆయన కు పరిస్థితిని వివరించారు. అప్పటికప్పుడు ప్రోటోకాల్ కాన్వాయ్ లేకపోవడంతో కలెక్టర్ కారులోనే ఆయన ప్రయాణించారు. స్పాట్ ను చూసిన తర్వాత ఆయన కాకినాడ వెళ్లారు.
వేట్లపాలెం గ్రామ పరిధిలోని గోదావరి కెనాల్ సమీపంలో ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల్లో అత్యధికులు మహిళా కూలీలే ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. స్పాట్ లో చనిపోయిన వారిలో ఈ ఫ్యాక్టరీ యజమాని తండ్రి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
విజయనగరం పర్యటన ముగించుకుని హుటాహుటిన వేట్లపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శనివారం రాత్రి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రోటోకాల్ కాన్వాయ్ కోసం వేచి చూడకుండా, ఆయన కలెక్టర్ కారులోనే ప్రయాణించి స్పాట్‌కు చేరుకున్నారు.
చీకటిలో తనిఖీలు: అప్పటికే చీకటి పడడంతో, సెల్‌ఫోన్ లైట్లు, పెన్ టార్చ్‌లు మరియు కారు హెడ్ లైట్ల వెలుగుల్లోనే సీఎం పేలుడు ధాటికి ధ్వంసమైన షెడ్లను పరిశీలించారు.
అధికారులను, మంత్రులను అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం ఆయన క్షతగాత్రులను పరామర్శించేందుకు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
అసలేం జరిగిందంటే ...
శనివారం ఉదయం ఎప్పటి మాదిరే 75 మంది కార్మికులు పనిలోకి వెళ్లారు. మధ్యాహ్నం వరకు పని బాగానే సాగింది. మధ్యాహ్నం తర్వాత ఉన్నట్టుండి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 2 గంటల సమయంలో కార్మికులంతా పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బాణసంచా నిల్వలు పేలాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించిందంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు ధాటికి పక్క గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాల స్లాబ్‌కు కూడా పగుళ్లు వచ్చాయి.
Next Story

