ఏపీలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్
x

ఏపీలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్

104 సంచార వైద్య వాహనాల ద్వారా ప్రతి వ్యక్తికి 47 రకాల పరీక్షలు.


రోగాల ముందస్తు నివారణకు ప్రాధాన్యత ఇస్తూ, పౌరుల ప్రస్తుత ఆరోగ్య స్థితిని సమగ్రంగా అంచనా వేసే కొత్త పథకానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ‘సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్’ పథకం కింద 104 సంచార వైద్య వాహనాల (MMUs) ద్వారా ఏడాదికి 56 లక్షల 40 వేల మందికి ఒక్కొక్కరికీ 47 రకాల వైద్య పరీక్షలు చేపట్టనున్నారు. దీనికోసం ఏడాదికి రూ.162.72 కోట్ల వ్యయం చేయనున్నారు.

ఎన్‌సిడి (నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్) సర్వేలో గుర్తించిన వ్యాధి అవకాశం ఉన్నవారు, వివిధ జబ్బుల పాలైనవారు, సంక్షేమ విద్యా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను కలిపి ఈ లక్ష్యం నిర్దేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విస్తృత చర్చల అనంతరం మంత్రి ఈ పథకానికి ఆమోదం ఇచ్చారు.

ప్రస్తుత విధానం, నూతన పథకం

ప్రస్తుతం 104 సంచార వాహనాలు గ్రామ స్థాయిలో 15 రోజులకోసారి కేవలం 6 రకాల పరీక్షలు (ర్యాండమ్ బ్లడ్ షుగర్, యూరిన్ షుగర్, హిమోగ్లోబిన్, మలేరియా ర్యాపిడ్ టెస్ట్, యూరిన్ అల్బుమిన్, గర్భధారణ నిర్ధారణ) మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఇవి కూడా ర్యాపిడ్ కిట్స్ ద్వారా జరుగుతున్నందున ఖచ్చితత్వం తక్కువగా ఉంది. వ్యక్తుల డిసీజ్ ప్రొఫైల్స్ లేదా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు (EHR) తయారీ కూడా జరుగడం లేదు.

కానీ కొత్త పథకంలో 11 అంశాలకు సంబంధించి ‘మొత్తం 47 రకాల ల్యాబ్ పరీక్షలు’ చేపట్టనున్నారు. వీటిలో కాలేయ సంబంధిత పరీక్షలు (LFT)-8, మూత్ర విశ్లేషణ-6, లిపిడ్ ప్రొఫైల్-5, తెల్ల రక్త కణాల కౌంట్-5, ఎర్ర రక్త కణాల కౌంట్-5, ఎలక్ట్రోలైట్స్-4, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్స్ (RFT)-3, గ్లూకోజ్ పరీక్షలు-3, కోయాగ్యులేషన్ టెస్ట్స్-2, ESR-1, 5 ఇతర పరీక్షలు ఉన్నాయి.

ప్రయోజనాలు

ఈ సమగ్ర పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రతి వ్యక్తికి వ్యక్తిగత డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు సృష్టించి ‘సంజీవని’ పథకం కింద జాగ్రత్తలు, రోగ నివారణ చర్యలు, జీవనశైలి సలహాలు అందించనున్నారు. “ఇప్పటి వరకు చికిత్సకు పరిమితమైన వైద్య విధానానికి భిన్నంగా ఇది నివారణాత్మక వైద్యానికి తలుపులు తెరుస్తుంది” అని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతలు

ఐదేళ్ల కాల పరిమితితో అమలు చేయనున్న ఈ పథకంలో సర్వీస్ ప్రొవైడర్ ప్రతి వాహనంలో సెమీ ఆటోమెటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్, CBC మెషీన్, మైక్రోస్కోప్, ఇంక్యుబేటర్‌లను స్వంత ఖర్చుతో ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనం రోజుకి 20 మందికి 47 పరీక్షలు చేస్తూ నెలకు 520 మందికి సేవలు అందించాలి.

శాఖ ఉన్నతాధికారులను రెండు నెలల్లో పథకాన్ని ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. అధికారులు త్వరలోనే సేవలు మొదలుపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

కొత్తదనం ఏమిటి?

ఈ పథకంలోని నిజమైన కొత్తదనం నివారణాత్మక వైద్యం (Preventive Healthcare) వైపు పూర్తి మార్పు.

ప్రస్తుతం కేవలం 6 రకాల ర్యాపిడ్ టెస్టులు. (తక్కువ ఖచ్చితత్వం) కొత్తది 47 రకాల అధునాతన ల్యాబ్ పరీక్షలు.

రోగం వచ్చిన తర్వాత చికిత్స. రోగం రాకముందే గుర్తింపు, డిసీజ్ ప్రొఫైల్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారీ.

సంజీవని పథకం ద్వారా వ్యక్తిగత సలహాలు, జాగ్రత్తలు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక ల్యాబ్ సదుపాయాలు అందుబాటులోకి తేవడం.

రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఇంత విస్తృత స్థాయిలో సమగ్ర ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమం అని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ చర్యతో రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణలో కొత్త అధ్యాయం మొదలవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story