Courtesy AI
x

CHITTOOR| సీఎం సొంతగడ్డపై కూటమి మార్క్ ఎలా ఉంది...?!

మలుపులు తిరుగుతున్న జిల్లా రాజకీయంపై వీడియో కథనం.


రాయలసీమ ప్రాంత నేతలే రాష్ర్ట రాజకీయాలను శాసిస్తూ ఉంటారు. కడప తరువాత చిత్తూరు జిల్లాదే కీలక స్థానం.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత గడ్డపై రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. జిల్లాను శాసించిన వైసీపీలో ఇప్పుడు ఏం జరుగుతోంది? క్యాడర్ ఎక్కడ దూకుడుగా ఉంది? ఎక్కడి నేతలు సైలెంట్ అయిపోయారు? అసలు అధికార కూటమిలో జనసేన గ్రాఫ్ ఎలా ఉంది. టీడీపీ నేతలు ఏమి చేస్తున్నారనే విషయాలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో స్థానిక సమస్యలపై రోడ్లెక్కి నిరసనలతో వైసీపీ క్యాడర్ ఫుల్ జోష్ మీద ఉంటోంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి టీటీడీపై విమర్శలు సంధించినా, ఆయన కొడుకు తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి స్థానిక సమస్యలపై నిరసనలకు దిగినా రాజకీయ కలకలం చెలరేగుతుంది. ఆ వెంటనే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పందించడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతి అంశంలో రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించాలనే వైసీపీ ఎత్తులకు పదునైన ఆధారాల అస్త్రాలతో టీడీపీ కూటమి నేతలు తగ్దేది లేదన్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు, బిజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ ప్రధాన కార్యదర్శి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ జీ. నరసింహయాదవ్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు కూడా ఏమాత్రం తగ్గడం లేదు.
చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి ఎదురునిలుస్తూ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 'సై అంటే సై' అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. దీంతో ఇక్కడ రాజకీయం నిత్యం వేడిగానే ఉంటుంది. శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుండగా.. నగరి ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకున్నాయి. గతంలో నియోజకవర్గాన్ని ఊపేసిన ఆమె, ప్రస్తుతం ఆ వివాదాల చుట్టూనే తిరగాల్సి వస్తోంది.

పెద్దన్న కోటలో..

చిత్తూరు జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట పుంగనూరు.. ఆయన తమ్ముడు ద్వారకానాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లెలో.. ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఆధీనంలోని రాజంపేట పార్లమెంట్ పరిధిలో.. వైసీపీకి క్యాడర్ బలంగా ఉన్నా, ప్రస్తుతం గట్టి 'స్తబ్దత' కనిపిస్తోంది. పెద్దాయన కోటలో సైలెన్స్ శ్రేణులను కలవరపెడుతోంది. ఇక చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, సత్యవేడు, పీలేరు, మదనపల్లి, పలమనేరు నియోజకవర్గాల్లో ఓటు బ్యాంక్ ఉన్నా నడిపించే లీడర్లు కరువయ్యారు. పూతలపట్టులో డాక్టర్ సునీల్ కుమార్, జీడీ నెల్లూరులో మాజీ డిప్యూటీ సీఎం కూతురు కృపారాణి ప్రజలకు దూరంగా ఉంటున్నారు. పీలేరులో చింతల రామచంద్రారెడ్డి అసలు జాడే లేరు. ఇక కుప్పంలో అయితే మరీ ఘోరంగా వైసీపీ ఆఫీస్‌ను ఖాళీ చేసేశారు. అక్కడి ఎమ్మెల్సీ భరత్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.

లోటు ఇదే..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత జిల్లా నుంచి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. రేసులో నిలిచిన పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి, మైనారిటీ కోటాలో మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా (జహా) ఊహలు తల్లకిందులు కావడంతో నైరాశ్యంలో పడ్డారు.
చిత్తూరు జిల్లా రాజకీయ పరిస్థితి ఎలా ఉందో చూడండి...

Read More
Next Story