
చిన్నప్పా, ఇన్ని ఆస్తులు ఎట్లా సంపాదించావప్పా!
చిన్నప్ప జీతం చిన్నదే.. ఆస్తులే చాంతాడంత పెద్దవి!
రాజకీయాల్లో 'పిఏ' (Personal Assistant) అంటే కేవలం అపాయింట్‌మెంట్లు చూసే వ్యక్తి మాత్రమే కాదు... బాస్ అంతరంగం, అధికార బలం, అంతకుమించి 'ఆర్థిక సామ్రాజ్యాల' తాళంచెవి అని మరోసారి నిరూపితమైంది. టిటిడి మాజీ ఛైర్మన్, వైసిపి కీలక నేత వైవీ సుబ్బారెడ్డి పీఏగా చక్రం తిప్పిన కదురు చిన్నప్పన్న ఆస్తుల చిట్టా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఊపేస్తోంది. ఏసీబీ అధికార వర్గాలు చెప్పిన సమాచారం చూస్తుంటే చిన్నప్ప సామ్రాజ్యం కూడా పెద్దదే.
చిన్నప్ప ఒకప్పుడు ఢిల్లీ ఏపీ భవన్‌లో స్పెషల్ లైజన్ ఆఫీసర్ ఉద్యోగం... చేతికి వచ్చే జీతం నెలకు కేవలం 75 వేల రూపాయలు. ఐదేళ్లలో మొత్తం సంపాదన 65 లక్షలు. కానీ, దర్యాప్తు సంస్థలు బయటపెట్టిన ఆస్తుల విలువ అక్షరాలా పదుల కోట్లు! తిరుమల వేంకటేశ్వరుడి కల్తీ నెయ్యి స్కామ్‌లో లంచాల వేటతో మొదలైనట్టు చెబుతున్న ఈయన ప్రస్థానం... వైజాగ్ రుషికొండపై లగ్జరీ విల్లాల దాకా ఎలా చేరింది? ఇది చిన్నప్పన్న కష్టార్జితమా? లేక ఆయన వెనుక ఉన్న పెద్దల బినామీ సామ్రాజ్యమా?
అధికారిక హోదా: ఏపీ భవన్ స్పెషల్ లైజన్ ఆఫీసర్ (2019-2024)
నెలకు వేతనం: రూ. 75,000
ఐదేళ్ల మొత్తం జీతం: రూ. 65 లక్షలు
బ్యాంకు ఖాతాల్లో జమైన మొత్తం: రూ. 4.69 కోట్లు (దీనిలో 4.64 కోట్లు విదేశీ/ఇతర ఖాతాలకు మళ్లింపు - సిట్ గుర్తింపు)
వెలుగు చూసిన ఆస్తుల చిట్టా (బుక్ వాల్యూ రూ. 2.76 కోట్లు - మార్కెట్ విలువ రూ. పదుల కోట్లు):
రుషికొండ (విశాఖ): అత్యంత ఖరీదైన 'పెబల్ బీచ్ టవర్స్' లో 11A నంబర్ విల్లా కొనుగోలు ఒప్పందం. (మార్కెట్ విలువ రూ. 8 నుండి 12 కోట్లు. అడ్వాన్స్ చెల్లింపు: రూ. 2 కోట్లు).
తగరపువలస: 2023లో కొనుగోలు చేసిన 5 ఓపెన్ ప్లాట్లు (ఒక్కొక్కటి 160 చ.గజాలు).
పరవాడ (అనకాపల్లి): 2024లో కొన్న 3 ఓపెన్ ప్లాట్లు.
తాడేపల్లి (గుంటూరు): కేపీఆర్ రెసిడెన్సీలో ఫ్లాట్ నంబర్ 304.
షేర్ మార్కెట్ పెట్టుబడులు: రూ. 45.15 లక్షలు.
వాహనాలు: మహీంద్రా XUV 700 కారు, వెస్పా స్కూటర్.
తిరుమల లడ్డూ 'కల్తీ నెయ్యి' కమీషన్లే మూలమా?
చిన్నప్పన్న కేవలం ఢిల్లీ పోస్టింగ్‌కే పరిమితం కాలేదు. వైవీ సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్‌గా ఉన్న నాలుగేళ్లూ తిరుమల వ్యవహారాల్లో ఈయనే 'షాడో'గా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. సిట్ (SIT) దర్యాప్తు ప్రకారం... తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి కాంట్రాక్టుల్లో కిలోకు రూ. 25 చొప్పున డెయిరీ ప్రతినిధులను డిమాండ్ చేసింది ఈయనే. 'ప్రీమియర్ అగ్రిఫుడ్స్' ఎండీ జగ్‌మోహన్ గుప్తా నుంచి ఏకంగా రూ. 50 లక్షలు హవాలా మార్గంలో చిన్నప్పన్నకు చేరాయనేది సిట్ కనుగొన్న నిజం. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపపు సొమ్ముతోనే ఈ ఆస్తులు కూడబెట్టారా అనే కోణంలో ఏసీబీ విచారణ జరుపుతోంది.
ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ మార్పు..!
2022లో ఉత్తరాంధ్ర వైసిపి ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డిని తప్పించి వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. సరిగ్గా చిన్నప్పన్న వైజాగ్ పై కన్నేసింది కూడా అప్పుడేనని అధికారులు గుర్తించారు! ఏసీబీ రికార్డుల ప్రకారం... రుషికొండ విల్లా ఒప్పందం, తగరపువలస, పరవాడల్లో ప్లాట్ల కొనుగోళ్లన్నీ 2023 మరియు 2024 లోనే జరిగాయి. అంటే బాస్ ఎక్కడ ఉంటే... పీఏ అక్కడ వసూళ్ల పర్వం సాగించారా? అనే అనుమానాలకు ఈ టైమ్‌లైన్ బలాన్నిస్తోంది.
"మండపేట మండలం ఏడిద గ్రామంలోని సోదరి ఇంట్లో దాక్కున్న చిన్నప్పన్నను ఏసీబీ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. జూన్ 8 వరకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మిగిలి ఉన్న బిలియన్ డాలర్ల ప్రశ్న ఒక్కటే... ఇవన్నీ చిన్నప్పన్న సొంత ఆస్తులేనా? లేక ఆయన కేవలం ఒక 'ఫ్రంట్ ఫేస్' (బినామీ) మాత్రమేనా?
నెలకు 75 వేల జీతగాడు రుషికొండపై రూ. 12 కోట్ల విల్లాకు అగ్రిమెంట్ చేసుకుంటుంటే... ఆ వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ఏసీబీ కస్టడీ విచారణలో చిన్నప్పన్న నోరు విప్పితే... ఉత్తరాంధ్రను శాసించిన ఏ 'పెద్ద తలకాయల' పేర్లు బయటకొస్తాయి? వేచి చూడాలి.
Next Story

