అమెరికాలో ఆరిన మరో తెలుగు దీపం: ఈ కుర్రాడు ఎందుకు కాల్చుకున్నాడంటే..!
x

అమెరికాలో ఆరిన మరో తెలుగు దీపం: ఈ కుర్రాడు ఎందుకు కాల్చుకున్నాడంటే..!

48 గంటల్లో ఇద్దరు తెలుగు పిల్లలు మృతి


అమెరికా.. ఆ పేరు వింటేనే ఒకప్పుడు అదృష్టం తలుపు తట్టినట్టు ఉండేది. కానీ ఇప్పుడు అదే అమెరికా తెలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. 48 గంటల వ్యవధిలోనే ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ప్రవాస భారతీయులను కలవరపెడుతోంది. నిన్న గుంటూరు యువకుడు సురేశ్ గుండెపోటుతో మరణించగా, నేడు కర్నూలు జిల్లాకు చెందిన చందు ఇరగనబోయిన బలవన్మరణం అందరినీ కలిచివేస్తోంది.

బండి ఆత్మకూరు నుంచి చికాగో వరకు..

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలానికి చెందిన చందు ఇరగనబోయిన (26) మధ్యతరగతి రైతు బిడ్డ. కొడుకు ప్రయోజకుడైతే తమ కష్టాలు తీరుతాయని భావించిన తల్లిదండ్రులు, స్థానికంగా ఉన్న ఆస్తులను కుదువ పెట్టి మరీ అతన్ని ఉన్నత చదువుల కోసం అమెరికా పంపారు. చికాగోలోని డీపౌల్ యూనివర్సిటీలో ఎమ్మెస్ పూర్తి చేసిన చందు, గతేడాది జూన్ నుంచి ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఆ ఉద్యోగం కాంట్రాక్ట్ పూర్తి కావడం, మళ్లీ ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28న చికాగోలోని తన అపార్ట్‌మెంట్‌లో పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒంటరితనం.. ఆర్థిక భారం.. ఒత్తిడి!

చందు మరణానికి అసలు కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యోగం పోవడం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని కొందరు చెబుతుండగా, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా మరికొందరు చెబుతున్నారు. చదువు కోసం తీసుకున్న భారీ ఎడ్యుకేషన్ లోన్, పెరుగుతున్న జీవన వ్యయం ఒత్తిడికి గురిచేసినట్లు తెలుస్తోంది.
వీసా కష్టాలు...
ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలస నిబంధనలు కఠినతరం కావడం, హెచ్-1బి వీసా విషయంలో అనిశ్చితి యువతలో భయాందోళనలు పెంచుతున్నాయి. విదేశీ గడ్డపై తన బాధను పంచుకునేవారు లేక, ఒంటరితనంతో చందు మానసిక వేదనకు గురైనట్లు అతని స్నేహితులు అనుమానిస్తున్నారు.
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం
"మా బిడ్డ వస్తాడనుకున్నాం.. కానీ ఇలా విగతజీవిగా వస్తాడనుకోలేదు" అంటూ చందు తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు తానా (TANA) ప్రతినిధులు చికాగో పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు, చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం 'గోఫండ్‌మీ' ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.
యువతకు ఒక విన్నపం
అమెరికా కలల వెనుక ఉన్న కఠిన వాస్తవాలను గుర్తించాలి. ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సమస్యలు ఏవైనా సరే.. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. చికాగోలోని తెలుగు అసోసియేషన్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. కన్నవారిని కడసారి చూపుకు కూడా నోచుకోకుండా చేసే ఇలాంటి కఠిన నిర్ణయాలు వద్దు!
Read More
Next Story