సాహితీ ‘ప్రకాషా’నికి చందు పురస్కారం ప్రదానం!
x
తాడి ప్రకాష్‌కు చందు సుబ్బారావు పురస్కారాన్ని అందజేస్తున్న దృశ్యం

సాహితీ ‘ప్రకాషా’నికి చందు పురస్కారం ప్రదానం!

ప్రసిద్ధ రచయిత, సీనియర్‌ జర్నలిస్టు తాడి ప్రకాష్‌ ఆచార్య చందు సుబ్బారావు సాహిత్య సేవా పురస్కారాన్ని విశాఖపట్నంలో అందుకున్నారు.


దాదాపు ఐదు దశాబ్దాల పాటు జర్నలిస్టుగా, సాహితీవేత్తగా సేవలందిస్తున్న తాడి ప్రకాష్‌కు ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ సాహిత్య సేవా పురస్కారం దక్కింది. తన రచనలతో ప్రజలను జాగృతం చేస్తూ సమాజానికి సేవలందిస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. విశాఖలోని ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో తాడికి ఈ అవార్డు ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు సాహిత్యవేత్తలు, రచయితలు, కవులు తాడి ప్రకాష్‌.. పత్రికారంగంతో పాటు సాహితీలోకానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. తన కలం నుంచి జాలువారే పదునైన పదజాలంతో అన్ని వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని శ్లాఘించారు. తాడి రచనలను, శీర్షికలను గుర్తు చేశారు. ఈ సభలో తాడి ప్రకాష్‌ గురించి వక్తలు ఎవరేమన్నారంటే?


మాట్లాడుతున్న తాడి ప్రకాష్‌

తాడి ప్రకాష్‌.. చిన్నింటోడు కాదు..

సభకు ముఖ్య అతిథిగా హాజరైన రచయిత, జర్నలిస్టు తాడి ప్రకాష్‌ చిన్నింటోడు కాదని ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు పేర్కొన్నారు. అన్ని రసాలను పండించగలగిన జానపద ఆధునిక వాక్య నిర్మాత ప్రకాష్‌ అని కొడియాడారు. ‘నవ రసాలను తన వ్యాసాల్లో చూపించే చతురత ఆయనకే సొంతం. తాడి రచనలు చదివాక ఆయన ఔన్నత్యం తెలుస్తుంది. కొంతమంది కవులు, రచయితలు, సాహితీవేత్తలు ఒక పంథాన్నే ఇష్టపడుతుంటారు. కానీ తాడి ప్రకాష్‌ అలా కాదు.. బహుళ ఇష్టాలు కలిగిన కమ్యూనిస్టు. ఆయన ఇష్టాల్లోనూ వైవిధ్యం కనిపిస్తుంది. తాడి రాసిన ఏలూరు రోడ్డు ఆత్మకథలో.. ఏలూరు కలుగులోంచి విజయవాడ రోడ్డుపైకి వచ్చిన ఎలుకనని ప్రకాష్‌ చెప్పుకుంటారు. కానీ ఆయన కలుగు నుంచి వచ్చిన ఎలుక కాదు.. ఏనుగు. వ్యక్తులను, సమాజాన్ని క్షుణ్ణంగా చదివి అవగాహనతో రాస్తుంటారాయన. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జర్నలిస్టు అండర్‌సన్‌ను తెలుగు లోకానికి పరిచయం చేసిన గొప్ప రచయిత ప్రకాష్‌. తన భావాలను రచనల ద్వారా ముక్కుసూటిగా చెప్పే సాహసం, పదాల వాడకం, పొందిక తాడి సొంతం.’ అని కీర్తించారు.

కవి సంధ్య చందు ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ఆచార్య సుబ్బారావు జయంతి నాడే..
సభకు అధ్యక్షత వహించిన చందు సుబ్బారావు ట్రస్ట్‌ చైర్మన్, యూపీఎస్‌సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం మాట్లాడుతూ ‘ఆచార్య చందు సుబ్బారావు 80వ జయంతి ఈరోజు. ఇటీవలే సుబ్బారావు కన్నుమూయడం, ఆయన లేకుండా సభ జరగడం బాధాకరం. సాహిత్య ప్రభావం ప్రజలపై చాలా ఉంటుంది. అందుకే ఆధునిక సాహిత్య కాలాన్ని అందరూ చదవాలి’ అని కోరారు. తాడి ప్రకాష్‌ను చందు సాహితీ పురస్కారానికి ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో వివరించారు.
తాడి వంశీయులు ఉత్తరాంధ్ర వారే..
తాడి ప్రకాష్‌ వంశీయులు ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన వారేనని సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, విశాఖ కోఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ జేవీ సత్యనారాయణ మూర్తి చెప్పారు. ‘ఆయన పూర్వీకులు విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు చెందిన వారు. ప్రకాష్‌ కుటుంబానికి వామపక్ష నేపథ్యం ఉంది. మార్క్సిజం గురించి తెలుసుకుంటేనే సమాజ ఆర్థిక పరిస్థితులు అర్థమవుతాయి. అప్పుడే పరిస్థితులు మార్చగలం. ఆ దిశగా తన జర్నలిజం ద్వారా తాడి ప్రకాష్‌ కృషి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
శీర్షికల్లో ప్రకాష్‌ది అందెవేసిన చేయి..
పత్రికారంగంలో ఉన్నప్పుడు వార్తా కథనాలకు శీర్షికలు పెట్టడంలో తాడి ప్రకాష్‌ది అందె వేసిన చేయి అని రైటర్స్‌ అకాడమీ చైర్మన్, లీడర్‌ పత్రికా సంపాదకుడు వీవీ రమణమూర్తి అన్నారు. గతంలో ఉదయం పత్రికలో పని చేసినప్పుడు విశాఖ జిల్లా కొత్తకోటలో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘దళితులు తమ వీధిలో పెళ్లి భోజనాలు నేలపై ఏర్పాటు చేసుకుంటే.. వాటిపై నుంచి అగ్రవర్ణాల వారు నడుచుకుంటూ పోయారు. ఆ వార్తకు తాడి ప్రకాష్‌ పెట్టిన ‘వారు హరిజనుల విస్తర్లపై నడిచి వెళ్లారు’ అనే పతాక శీర్షిక అప్పట్లో పెను సంచలనమైంది. మీడియా రంగంలో పరిణామాలను తొలుత నుంచ ప్రకాష్‌ ఆకళింపు చేసుకుంటున్నారు. నేటి జర్నలిస్టులకు వార్తల్లో పస ఉండడం లే దు. సాహిత్యంపై అవగాహన, పట్టున్న కొత్త తరం జర్నలిస్టులు లేకపోవడం బాధాకరం’ అని పేర్కొన్నారు.
అనుకోకుండా జర్నలిజంలోకి వచ్చా..
తాను 1977లో అనుకోకుండా ఈనాడులో చేరానని అవార్డు గ్రహీత తాడి ప్రకాష్‌ చెప్పారు. అవార్డు ప్రదానం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అప్పట్లో హైదరాబాద్‌ నుంచి విశాఖ యూనిట్‌కు వెళ్లడానికి ఆసక్తి ఉన్న వారు చేతులెత్తండి అని అడిగారు. మరొకాయనతో పాటు నేనూ చేతులెత్తాను. అప్పటికి విశాఖలో రావి శాస్త్రి, పతంజలి, పురిపండ, గణపతిరాజు అచ్యుతరామరాజు వంటి వారుంటారని నాకు తెలియదు. వైజాగ్‌ వచ్చాక బాగా రాణించాను. కొన్నాళ్లకు పురిపండ చనిపోయే సమయానికి తిరుపతి డెస్క్‌లో ఉన్నాను. ఆ వార్తకు నేను పెట్టిన సంస్కృతంతో కూడిన శీర్షిక ఎడిటర్‌కు నచ్చలేదు. ఆయన ‘వినపడని దూరాలకు వెళ్లిపోయిన పురిపండ’ అనే శీర్షికను పెట్టారు. బతుకంతా వాడుక భాష గురించి పోరాడిన వ్యక్తికి సంస్కృతం హెడ్డింగ్‌ పెట్టావు అన్నారు. ఇలాంటి ఘటనలు నన్ను మంచి శీర్షికల వైపు ఆలోచించేలా, నాకు రాణింపు, గుర్తింపు తెచ్చాయి. నాకు ఆచార్య చందు సుబ్బారావు పురస్కారం దక్కడం చాలా ఆనందంగా ఉంది. కృతజ్ఞతలు’ అని ముగించారు. ఇంకా సభలో రచయితలు, సాహితీవేత్తలు ఆచార్య వెలమల సిమ్మన్న, మేడా మస్తాన్‌రెడ్డి, డీవీ సూర్యారావు, మాటూరి శ్రీనివాసరావు, అడపా రామకృష్ణ, సీహెచ్‌ చినసూర్యనారాయణ, బసు పోతన తదితరులు హాజరయ్యారు. సభలో కవి సంధ్య అనే చందు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
Read More
Next Story