
ఏఐ, ఐటీ మీద మంత్రులకు చంద్రబాబు క్లాస్
వెనుకబడితే కష్టమేనని సీఎం హెచ్చరిక.
కేబినెట్ భేటీ అంటే కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. మంత్రులకు పరిపాలనా పాఠాలు నేర్పే వేదిక కూడా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో అజెండా అంశాలు ముగిసిన తర్వాత, మంత్రులతో తాజా రాజకీయ, సాంకేతిక పరిణామాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ (AI), ఐటీ రంగాలపై మంత్రులకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు.
ఏఐపై పట్టు లేకుంటే వెనుకబడతారు
ప్రపంచం ఇప్పుడు కృత్రిమ మేధ (Artificial Intelligence) వైపు పరుగులు తీస్తోందని, మంత్రులు ఈ సాంకేతికతపై కనీస పరిజ్ఞానం పెంచుకోకుంటే కాలంతో పాటు పోటీ పడలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐటీ, ఏఐ అంశాలలో అప్‌డేటెడ్‌గా ఉండాలని, పరిపాలనలో వీటిని ఎలా వాడుకోవాలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఆయన గుర్తుచేశారు. అమెరికా పర్యటనలో మంత్రి లోకేశ్ గూగుల్ ప్రతినిధులను కలిసి ఒప్పించిన తీరును వివరిస్తూ, పెట్టుబడులను ఆకర్షించడంలో ఉండాల్సిన చొరవను ఇతర మంత్రులకు వివరించారు.
మంత్రులకు బాధ్యతల అప్పగింత - వ్యక్తిగత నివేదికలు
రాష్ట్రంలోని పలు కీలక శాఖలకు సంబంధించి మంత్రులకు సీఎం కీలక ఆదేశాలిచ్చారు. జలధార- జలహారతి కార్యక్రమంలో మంత్రులందరినీ భాగస్వాములను చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. సూర్యఘర్ పథకం లక్ష్యాలను చేరుకోవడానికి మరిన్ని కసరత్తులు చేయాలని మంత్రి గొట్టిపాటి రవికి ఆదేశాలిచ్చారు. ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లొచ్చిన మంత్రులు అక్కడ నేర్చుకున్న ఉత్తమ విధానాలపై వ్యక్తిగతంగా నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేశారు. పుట్టపర్తి వద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్‌కు వేగంగా అనుమతులు రావడం మన ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమని కొనియాడారు.
ప్రజా సంక్షేమమే పరమావధి
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను, మంత్రులను సీఎం ఆదేశించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అందుబాటులో ఉండాలని, పాలనలో సాంకేతికతను జోడించి అత్యుత్తమ ఫలితాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story

