
చంద్రబాబు దంపతులు (ఏఐ ఇమేజ్)
మా ఆవిడ బంగారం! మురిసిపోయిన చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఇదే సందడి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో మిన్నంటాయి. అటు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయంగా, ఇటు అభిమానుల వినూత్న ప్రదర్శనలతో ఈ వేడుకలు ప్రత్యేకతను చాటుకున్నాయి.
మురిసిపోయిన చంద్రబాబు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజును తన సతీమణి నారా భువనేశ్వరి సమక్షంలో అత్యంత ఆత్మీయంగా జరుపుకున్నారు. భువనేశ్వరి స్వయంగా కేక్ తినిపించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.
"జీవితంలో మరో ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ.. ఎప్పటికీ అండగా నిలిచే జీవిత భాగస్వామితో కలిసి నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆమె సహకారం, ఆప్యాయత వల్లే జీవితం మరింత అర్థవంతంగా మారుతోంది." అని పేర్కొన్నారు.
చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా భుననేశ్వరి 77 లక్షల రూపాయలను అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇచ్చారు.
ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ: చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధిలో ఆయన పాత్రను ప్రశంసించారు.
పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు పరిపాలనా దక్షతను కొనియాడుతూ అభినందనలు కురిపించారు.
అభిమానం వెల్లివిరిసిన వేళ..
చంద్రబాబుపై తమకున్న ప్రేమాభిమానాలను అభిమానులు, కళాకారులు వినూత్న రీతిలో చాటుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన కళాకారుడు దేవిన శ్రీనివాస్ తన అద్భుత కళాఖండంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 150 గ్రాముల సబ్బుపై చంద్రబాబు ముఖచిత్రాన్ని అత్యంత నైపుణ్యంతో చెక్కారు. ఈ అపురూప కళాకృతిని రూపొందించడానికి ఆయన సుమారు 13 గంటల పాటు శ్రమించారు.
ధాన్యపు గింజలతో చిత్రపటం
కడియం మండలంలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ ధాన్యపు గింజలతో చంద్రబాబు నిలువెత్తు చిత్రపటాన్ని రూపొందించారు. కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్య ప్రసాద్, వెలుగుబంటి యూత్ సభ్యులు ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు.
ఈ కళాకృతిని చూసేందుకు మంత్రులు కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేసి కళాకారులను అభినందించారు.
అభివృద్ధి ప్రదాతగా ప్రశంసలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, ఇతర పెట్టుబడులను తీసుకురావడంలో చూపిస్తున్న చొరవను మంత్రులు కొనియాడారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న "అభివృద్ధి ప్రదాత" గా ఆయనకు నీరాజనాలు అర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహిస్తూ తమ నాయకుడి పుట్టినరోజును ఘనంగా నిర్వహించాయి.
Next Story

