గ్యాస్ కేటాయింపులో కేంద్రం మార్పులు..
x

గ్యాస్ కేటాయింపులో కేంద్రం మార్పులు..

పైప్‌లైన్ వంటగ్యాస్‌, LPG, CNG తొలి ప్రాధాన్యం..


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల్లో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో సహజ వాయువు (గ్యాస్) కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా రంగాలకు మళ్లిస్తూ కొత్త కేటాయింపు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఇకపై LPG ఉత్పత్తి, CNG, పైపుల ద్వారా గృహాలకు సరఫరా చేసే వంటగ్యాస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇతర రంగాలకు గ్యాస్ ఇవ్వడానికి ముందు ఈ అవసరాలను పూర్తిగా తీర్చాలని నిర్ణయించారు.


ప్రాధాన్యతా క్రమం ఇలా..

కొత్త కేటాయింపు ప్రకారం సహజ వాయువు సరఫరాకు నాలుగు స్థాయిల ప్రాధాన్యతా క్రమాన్ని ప్రభుత్వం నిర్ణయించింది.

1వ ప్రాధాన్యం..పైపుల ద్వారా వచ్చే గ్యాస్ (PNG), వాహనాల కోసం వాడే CNG, అలాగే LPG ఉత్పత్తి. ఈ రంగాలకు 100 శాతం గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

2వ ప్రాధాన్యం.. ఎరువుల కర్మాగారాలు. ఈ రంగానికి గత ఆరు నెలల సగటు వినియోగంలో కనీసం 70 శాతం అందించాలి.

3వ ప్రాధాన్యం.. తేయాకు పరిశ్రమలు, తయారీ రంగం, ఇతర పారిశ్రామిక వినియోగదారులు. వీటికి గత ఆరు నెలల సగటు వినియోగంలో 80 శాతం వరకు గ్యాస్ అందించాలి.

4వ ప్రాధాన్యం..పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే నగర గ్యాస్ పంపిణీ సంస్థలు (CGD). వీటికి కూడా సుమారు 80 శాతం వరకు సరఫరా ఉండేలా చూడాలి.


దేశీయ గ్యాస్‌ మళ్లింపు..

ప్రస్తుతం భారత్ రోజుకు సుమారు 191 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగిస్తుంది. ఇందులో సగభాగాన్ని దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ ద్వారా తీర్చుతున్నారు.

కొత్త నిర్ణయం ప్రకారం..పెట్రోకెమికల్ కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, అధిక ధరల గ్యాస్ వినియోగించే పరిశ్రమలకు సరఫరాను తగ్గించి, ఆ గ్యాస్‌ను ప్రాధాన్యతా రంగాలకు మళ్లించనున్నారు.


పశ్చిమాసియా సంఘర్షణ ప్రభావం..

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ తీసుకున్న చర్యల కారణంగా పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణా తీవ్రంగా తగ్గింది.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు, LNG ఎగుమతుల్లో మూడో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. భారత్‌కు దిగుమతి అయ్యే LNG, LPGలో కూడా పెద్ద భాగం ఇదే మార్గం ద్వారా వస్తుంది.

ఈ నేపథ్యంలో ట్యాంకర్ రవాణాలో అంతరాయాలు ఏర్పడడంతో ప్రభుత్వం దేశీయ గ్యాస్ వినియోగాన్ని పునర్వ్యవస్థీకరించింది.


రెస్టారెంట్లలో ఆందోళన..

వాణిజ్య LPG సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలా చోట్ల కేవలం ఒకటి లేదా రెండు రోజుల స్టాక్ మాత్రమే మిగిలి ఉందని యజమానులు చెబుతున్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు కొన్ని హోటళ్లు ఇప్పటికే మెనూలో ఉన్న ఆహార పదార్థాల సంఖ్యను తగ్గించాయి.

తమిళనాడు హోటల్స్ అసోసియేషన్ వాణిజ్య LPG సరఫరా నిలిపివేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఇదే సమయంలో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కూడా నగరంలోని వందలాది హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించింది.


LPG ధరల పెంపు..

గృహ వినియోగ LPG సిలిండర్ ధరను రూ.60 పెంచింది

వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ.114.50 పెంచింది


గ్యాస్ సరఫరా బాధ్యత GAILకు..

కొత్త ప్రాధాన్యతా క్రమాన్ని అమలు చేయడానికి సహజ వాయువు సరఫరాను నిర్వహించే బాధ్యతను ప్రభుత్వ సంస్థ GAILకు అప్పగించారు.

ఈ చర్యల ద్వారా గృహ వంటగ్యాస్, వాహనాల ఇంధనం మరియు ఎరువుల ఉత్పత్తి వంటి కీలక రంగాలకు గ్యాస్ కొరత రాకుండా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.


Read More
Next Story