చంద్రబాబూ, ఎవరి కోసం సాయికృష్ణ కేసును కప్పెట్టారు? జగన్
x

చంద్రబాబూ, ఎవరి కోసం సాయికృష్ణ కేసును కప్పెట్టారు? జగన్

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై విచారణ ఏది? చంద్రబాబు 'జంగిల్‌రాజ్' పాలనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం


రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో 'రూల్ ఆఫ్ లా' స్థానంలో 'రూల్ ఆఫ్ ఫియర్' (భయానక పాలన) నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. కస్టడీలోకి తీసుకున్న ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి, చివరకు శవాన్ని కూడా మాయం చేసిన పాశవిక ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైందని ఆయన మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరును, పోలీసు వ్యవస్థ వైఫల్యాలను ఎండగట్టారు.
సాయికృష్ణ కేసులో పెద్దలను కాపాడుతున్నారు!
సాయికృష్ణ కేసు రిమాండ్ రిపోర్టు, సిట్ దర్యాప్తు తీరును గమనిస్తే కేసును వీక్ చేసి, పైస్థాయి అధికారులను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు.

సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. టాస్క్‌ఫోర్స్ అనేది పోలీస్ కమిషనర్ (సీపీ) పరిధిలో పనిచేస్తుంది. మరి విజయవాడ సీపీని ఎందుకు విచారించడం లేదు?" అని జగన్ ప్రశ్నించారు.

మే 28న సాయికృష్ణ తల్లి తన కొడుకు లాకప్‌డెత్‌కు గురయ్యాడనే అనుమానం ఉందంటూ స్వయంగా సీపీకి అర్జీ ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదని, బంధువులు మొరపెట్టుకున్నా డీజీపీ ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. સીఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని ధ్వజమెత్తారు.
18 నెలల సీసీ ఫుటేజీ మాయం.. కుట్ర చాలా లోతైనది!
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 18 నెలల సీసీకెమెరాల ఫుటేజీని తొలగించినట్లు సిట్ చెబుతోందని, సీఎం, డీజీపీ ఉండే రాష్ట్ర రాజధానిలోనే ఇలా ఫుటేజీ డిలీట్ చేయడం ఎలా సాధ్యమని జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫుటేజీ డిలీట్ చేసినా, కమాండ్ కంట్రోల్ సెంటర్, సీపీ ఆఫీస్, డీజీపీ కంట్రోల్‌లో ఉండే ఫుటేజీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మ్యాట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజీ ఉండే అవకాశం ఉన్నా సిట్ వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, నిందితుల ఫోన్ కాల్ రికార్డులను ఎందుకు పరిశీలించడం లేదని అడిగారు. కానిస్టేబుళ్లు ఫోన్లను నాగ్‌పూర్‌లో అమ్మేశారని రిమాండ్ రిపోర్టులో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బాధితుల పక్షాన నిలిస్తే ఎదురుదాడి చేయిస్తారా?
మొదట సాయికృష్ణను రౌడీషీటర్ అంటూ చంద్రబాబు అనుకూల మీడియాతో ఎదురుదాడి చేయించారని, జనం ఛీత్కరించుకునేసరికి యూ-టర్న్ తీసుకుని బాధితుడి కుటుంబాన్ని సెక్రటేరియట్‌కు పిలిపించుకున్నారని జగన్ విమర్శించారు. తాము బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన నాలుగు రోజుల తర్వాతే ఈ కేసులో అరెస్టులు జరిగాయని, ఒకవేళ తాము వెళ్లకపోతే ఈ కేసే లేకుండా మాయం చేసేవారని పేర్కొన్నారు. ఈ ఘోరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు తన 'పార్టనర్'ను ఒక సైడ్ క్యారెక్టర్ లాగా తెరపైకి తెచ్చి పొలిటికల్ డ్రామాలు ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో భయానక వాతావరణం
కేవలం సాయికృష్ణ కేసే కాకుండా, కృష్ణా జిల్లాలో పోలీసుల వేధింపులకు బలవుతూ సీఐ పేరును మరణవాంగ్మూలంగా వీడియో తీసి చనిపోయిన దళిత యువకుడు క్రాంతికుమార్ కేసు, కర్నూలు లాకప్‌డెత్‌లో మరణించిన దళిత మహిళ గంగమ్మ కేసు, తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతి కేసులు రాష్ట్రంలో నెలకొన్న అరాచక 'రెడ్‌బుక్ రాజ్యాంగానికి', చంద్రబాబు నడుపుతున్న 'జంగిల్‌రాజ్' పాలనకు అద్దం పడుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం వరకు ఏపీ అంటే సంక్షేమం, అభివృద్ధి గుర్తొచ్చేవని, కానీ నేడు కస్టోడియల్ డెత్స్, శవాల మాయం, మోసాలే కనిపిస్తున్నాయని, ఏపీ చరిత్రలో ఇంతటి మానవ హక్కుల ఉల్లంఘన ఎన్నడూ చూడలేదని వైఎస్ జగన్ ముగించారు.
Read More
Next Story